కర్ణాటక సీఎం, బీజీపీ నేతలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ముఖ్యమంత్రి, ఆ పార్టీ నేతలంతా ప్రధాని మోడీ ముందు కుక్క పిల్లల లాంటి వారని అన్నారు. ప్రధానిని చూస్తే వారంతా వణికి పోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక అలవెన్స్ ల కింద రాష్ట్రానికి రూ.5,495 కోట్లు ఇవ్వాలని 15వ వేతన సంఘం సిఫారసు చేసిందని ఆయన పేర్కొన్నారు. కానీ ఆ నిధులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు సమకూర్చలేదని చెప్పారు. ఈ విషయం గురించి ప్రధానితో మాట్లాడేందుకు సీఎంకు, ఆ పార్టీ నేతలకు దమ్ము లేదని విమర్శలు గుప్పించారు.
సిద్ద రామయ్య వ్యాఖ్యలపై సీఎం బసవరాజ్ బొమ్మై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిద్ధ రామయ్యకు రాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సిద్దరామయ్య వ్యక్తిత్వాన్ని బయటపెడుతున్నాయని ఆయన అన్నారు.
కుక్క విశ్వాసం గల జంతువు అని ఆయన చెప్పారు. అది తన విధుల్ని ఎంతో విశ్వాసంగా చేస్తుందన్నారు. ప్రజల కోసం తాను విశ్వాసంగా పని చేస్తానని వెల్లడించారు. అంతే కాని తాను సిద్ధరామయ్య లాగా ఈ సమాజంలో చిచ్చు పెట్టి చీలికలు తీసుకురాలేదన్నారు.