యడియూరప్ప రాజీనామాతో ఖాళీ అయిన కర్నాటక సీఎం పోస్టులో.. బసవరాజ్ బొమ్మైని నియమించింది బీజేపీ అధిష్టానం. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బసవరాజ్ బొమ్మైని సీఎంగా ఎన్నుకున్నట్లు యడియూరప్ప ప్రకటించారు. బొమ్మై ప్రస్తుతం కర్ణాటక హోంమంత్రిగా ఉన్నారు.
లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మై.. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరారు. 1998, 2004లో ఎమ్మెల్సీగా పని చేశారు. కర్నాటక మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడే ఈ బసవరాజ్. మెకానికల్ ఇంజనీర్, పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందారు. ఆయన రేపు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.