అంతర్మధనంలో సారయ్య
ఎమ్మెల్సీగా దక్కని అవకాశం
కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన సారయ్య
తీవ్ర నైరాశ్యంలో సారయ్య అనుచరులు
నాలుగేళ్లుగా పదవి కోసం ఎదురు చూపులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు అధికారంలో వున్న పార్టీలో చేరాక జాతకం తిరగబడింది. ఇప్పుడాయన రాజకీయ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లుగా టీఆర్ఎస్‌లో కొనసాగుతు ఎలాంటి పదవిని చేపట్టకుండా వున్న ఈ అసంతృప్త నేత వేరెవరో కాదు, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ! ఇప్పుడాయన చూపు ఎటూ.. దీనిపై తొలివెలుగు ప్రతినిధి నర్శింహా అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్..
సన్మానాలతోనే సరి ! పదవి దక్కేనా మరి ?
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన బస్వరాజు సారయ్య తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004, 2009లో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 20012- 2014వ సంవత్సరంలో తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. మూడుసార్లు గెలిచి హాట్రిక్ సాధించిన సారయ్య దక్షిణ భారతదేశంలో రజక కులం నుంచి ఏకైక ఎమ్మెల్యేగా వున్నారు. బీసీ నాయకుడిగా వున్న సారయ్య తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన వంతు కృషి చేశారు. తెలంగాణ ఏర్పాటును అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి వ్యతిరేకించినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా తెలంగాణ కోసం అధిష్టానం ముందు తన బాణీ వినిపించారు. 2014లో వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై పరాజయం పాలయ్యారు. అయినా రెండేళ్లు కాంగ్రెస్‌లోనే ఉన్న సారయ్య 2016లో ఫిబ్రవరి 23న కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీగా కొనసాగుతున్నారు. 2018 సంవత్సరంలో తూర్పు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కలేదు. అక్కడి నుంచి నన్నపనేని నరేందర్‌కు టికెట్ ఇచ్చి సారయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని టీఆర్ఎస్ అధిష్టానం హామీ ఇచ్చింది. కానీ నేటికీ నెరవేరలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించలేదు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా బండ ప్రకాశ్‌కు అవకాశం ఇచ్చారు.
బడుగు బలహీన వర్గం (రజక) సామాజిక వర్గానికి చెందిన బస్వరాజు సారయ్య కాంగ్రెసు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. దక్షిణ భారతదేశంలోనే రజక కులానికి చెందిన ఏకైక ప్రతినిధి కావడంతో కాంగ్రెస్‌లో ప్రాధాన్యం ఇవ్వడంతో బీసీ నేతగా ఎదిగి గాడ్ ఫాదర్ లేకున్నా మంత్రి పదవి చేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య, డీఎస్, రెడ్యానాయక్, కొండా సురేఖ కాంగ్రెస్‌లో మంత్రులుగా కొనసాగారు. కాంగ్రెస్ వున్నప్పుడు మంత్రిగా కొనసాగిన సారయ్య టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదని అంతర్మధనం చెందుతున్నారు. మాజీ మంత్రి సారయ్య పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలోని ముఖ్య నేతలంతా టీఆర్ఎస్‌లో చేరడంతో అందరికి అవకాశాలు కల్పించలేకపోతున్నారా అనేది ఓ వాదన. ఏదేమైనా ఎటు చూసిన సారయ్యకు ఒక్కడికే అవకాశం దక్కలేదు. గ్రేటర్ వరంగల్ మేయర్‌గా వున్న నరేందర్‌ను రాజీనామా చేయించి మరీ ఎమ్మెల్యేగా కేసీఆర్ అవకాశం కల్పించారు. ఆ సందర్భంగానే సారయ్య అనుచరులు దిగులు చెందారు. అయినప్పటికీ కేసీఆర్‌పై నమ్మకంతో నరేందర్ గెలుపు కోసం కృషి చేశారు. అవకాశాలు చేజారిన కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ఆశించి భంగపడ్డారు. కనీసం రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కూడా సారయ్యకు ఇవ్వ లేదు. తాజాగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రధాన పోస్టులు భర్తీ చేశారు. వాటిలోనూ అవకాశం ఇవ్వలేదు. తాజాగా స్థానిక సంస్ధల ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించలేదు. ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్దుల్లోను ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఈసారి కచ్చితంగా బెర్త్ దొరుకుతుందని ఆశించిన సారయ్యకు టీఆర్ఎస్ అవకాశం ఇవ్వలేదు. ఇదిలా ఉండగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే అధికార టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారు అనే వార్తలు వచ్చాయి కానీ, కథ అడ్డం తిరగటంతో టీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా.. లేక పార్టీ మారుతారా అనేది వేచి చూడాల్సిందే.