బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న పండుగ. బతుకమ్మ ఉత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూవాడా.. బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాల.. పాటలు మారుమోగాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. అందులోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ ఫెస్టివల్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భాద్రపద అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో మొదలయ్యే ఈ వేడుకలు.. దసరా మరుసటి రోజు వరకు అంటే సద్దుల పండుగతో ముగుస్తాయి. ఎంగిలి పూలబతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా 9 రోజుల్లో ప్రతి రోజూ ఒక్కొ రకమైన పూలతో బతుకమ్మను పేరించి.. దీవించండి అమ్మా అని మొక్కుతారు.
బతుకమ్మ వేడుకల్లో పిల్లా పాపలు, మహిళలు, యువతులు చేసే సందడే వేరు. ఆటపాటలతో తామంతా ఒక్కటే అనే భావనతో ఆడిపాడుతారు. ఇక బతుకమ్మలో ప్రధాన ఆకర్షణగా నిలిచేవి తీరొక్క పూలు. బంతి, చామంతి, గునుగు, తంగేడు, గులాబీ.. ఒక్కటేంటి… ప్రకృతిలో లభించే పూలతో అందంగా అలంకరించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. రోజుకో రకమైన పూలతో అలకంరిస్తూ వేడుకలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ క్రమంలో గౌరి మాతకు తిరొక్క నైవేద్యాలను కూడా సమర్పిస్తారు. అయితే తొమ్మదివ రోజూ బతుకమ్మ పండగను పురష్కరించుకుని ఎలా గౌరిని గంగమ్మ ఒడిలోకి చేర్చుతారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా బతుకమ్మ పండుగ నిర్వహించలేదు రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో ఈ సంవత్సరం ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు.
కాగా హైదరాబాద్ లో ప్రతీయేటా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. అందులోనూ ప్రత్యేకంగా ట్యాంక్ బండ్ లో, ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ సంబరాలను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తులో నిర్వహించింది. దీంతో ఎల్బీ స్టేడియం వైపు సోమవారం మధ్యాహ్నాం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బషీర్ బాగ్, పీసీఆర్ జంక్షన్, లిబర్టీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, రాణిగంజ్, నల్లగుట్ట, నాంపల్లి, తెలుగు తల్లి, నారాయణ గూడ, హిమయత్ నగర్, కవాడి గూడ తదితర కూడళ్లలో ట్రాఫిక్ ను మళ్లించారు. అయితే ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్ తో పాటు అప్పర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది మహిళలు భారీగా చేరుకుని బతుకమ్మ ఆట, పాటలు పాడుకుంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. గౌరీ పూజలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. బతుకమ్మలు, కళాకారుల ప్రదర్శనలతో ట్యాంక్‌బండ్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో మహిళలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో తొమ్మిదో రోజు, చివరి రోజు అయిన ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మగా గౌరమ్మను ఆరాధిస్తారు. పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి, పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకూ ఆటపాటలతో అమ్మవారిని కొలిచి, బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.
అలాగే ట్యాంక్ బండ్ వైపు కూడా పలు ట్రాఫిక్ ఆంక్షలు కంటిన్యూ అవుతున్నాయి. సికింద్రాబాద్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్, జబ్బార్ కాంప్లెక్స్, కవాడి గూడ, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లించబడుతుంది. అలాగే పంజాగుట్ట, రాజ్ భవన్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు వెళ్లే వాహనాలను ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రసాద్ ఐమాక్స్, మింట్ లేన్ వైపు మళ్లించారు. ముషీర్ బాద్, కవాడిగూడ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ ను కవాడి గూడ ఎక్స్ రోడ్ వద్ద లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ వైపు మళ్లించారు.
ట్యాంక్ బండ్ పై బతుకమ్మ పండుగతో భారీ ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. నాలుగు వేల బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని భారీ ప్రదర్శనగా ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. ఈ ర్యాలీలో కళాకారుల ప్రదర్శలు ఆకట్టుకున్నాయి. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలతో కలిసి కవిత ఆడిపాడారు. బతుకమ్మలతో హుస్సేన్‌సాగర్ కాంతులీనింది. బాణాసంచా చూపరులను ఆకట్టుకుంది. వేల సంఖ్యలో మహిళలు వచ్చి సద్దుల బతుకమ్మ ఆడుతుండటంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఎలా జరిగాయో ఓ లుక్కేసెద్దాం. సూర్యాపేటలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగాయి. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి.. రాగ యుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. ఖమ్మంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చారు. వాటి చూట్టూ ఆడిపాడారు. సత్తుపల్లిలో బతుకమ్మ వేడుకలు ఆకాశాన్ని తాకాయి. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఆడిపాడి సందడి చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో భారీసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ, కోలాటం ఆడుతూ సంబరాలు చేసుకుని.. బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కరీనంగర్ జిల్లా కేంద్రంలోనూ సద్దుల బతుకమ్మ వేడుకలకు భారీ ఎత్తున ఏర్పాట్లుచేశారు. మెదక్‌లోనూ ఉత్సాహంగా మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. హన్మకొండలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు జాతరను తలపించాయి. అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకుని వందలాదిగా తరలివచ్చిన మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం మహిళలు సద్దుల బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు.