కేంద్ర ప్రభుత్వం తాటతీస్తాం.. మెడలు వంచుతామని ప్రగల్బాలు పలికిన టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్ వచ్చి సల్లపడ్డాని విమర్శించారు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క. ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తామని పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి ఏం సాధించారని నిలదీశారు. కేంద్రం వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పార్లమెంటు సమావేశాల్లో ఆందోళన చేయాలని డిమాండ్ చేశారు. చివరి వరకు రైతులతో కలిసి పోరాటం చేయాలన్నారు. అలా చేయకుండా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను ఫూల్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవంబర్ 29 నుంచి ప్రారంభమైన శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు మొక్కుబడిగా వారం రోజుల పాటు ఆందోళనల పేరుతో టైంపాస్ చేశారని ఎద్దేవా చేశారు. దాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఆందోళన చేయాలన్న చిత్తశుద్ధి సీఎం కేసీఆర్ కు, టీఆర్ఎస్ ఎంపీలకు లేదని విమర్శించారు. ఢీల్లీలో ఎంపీలతో ధర్నా చేయిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం తిరిగి ఎందుకు హైదరాబాద్ కు రప్పించారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీలు ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయాలు చేస్తూ రైతుల ప్రాణాలను హరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 రోజుల్లో 206 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. సుమారు 62లక్షల ఎకరాల్లో కోటి 3 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం… 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి రైతులను మూడు నెలలుగా అరిగోస పెట్టిందని ఆరోపించారు. ఇంకా 20 శాతం వరి చేలు కోతకు ఉన్నాయన్నారు. అయినా అప్పుడే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి 1982 కొనుగోలు కేంద్రాలను మూసి వేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40.66 లక్షల రైతులకు సంబంధించి రూ.25,936 కోట్ల క్రాఫ్ లోన్స్ ఉండగా.. గడిచిన మూడేళ్లలో కేవలం 4 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 732.24 కోట్లు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఇంకా 36.66 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 25,203 కోట్లను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకుల్లో కొత్త అప్పు పుట్టకపోగా.. అధిక మిత్తికి ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పు చేసి తిరిగి తీర్చలేక మనస్తాపంతో రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే సీఎం కళ్లకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు భట్టి.