కాంగ్రెస్ పార్టీకి అర్జెంట్‌గా ఓ క్లబ్ కావాలట! ఔను, ఇది నిజం. అసెంబ్లీని ఎన్ని రోజులు సమావేశపరచాలి, ఏ సమస్యలు చర్చించాలి అని నిర్ణయించే బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అడిగింది ఇదే. ‘మాకు అర్జెంట్‌గా ఒక క్లబ్ కావాలి’ అని ఒకే ఒక మాట భట్టీ బీఏసీలో చాలా గట్టిగా అడిగారట. దానికి సీఎం వెంటనే మంజూరు కూడా చేసేయడం కొసమెరుపు.
రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయ్. విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోపక్క యూరియా దొరక్క రైతులు చనిపోతున్నారు. యురేనియం తవ్వకలతో అడవుల్లో చిచ్చు రగులుతూ వుంది. వానొస్తే హైదరాబాద్ మహా సముద్రంగా మారిపోతోంది. ఇవేవీ ప్రజా సమస్యలు కావన్నట్టుగా ‘ఢిల్లీలో ఉన్నట్లు ఇక్కడ కూడా మాకు ఒక క్లబ్ కట్టించండి అర్జెంటుగా..’ అని భట్టీ అడగడం, దాన్ని కేసీఆర్ నెరవేర్చడం.. అక్కడున్న అందర్నీ ఆశ్చర్చపరచిందని సమాచారం.
బీఏసీలో ప్రతిపక్ష శాసనసభ్యులు ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన అంశాల గురించి సభలో చర్చించాలని పట్టుబట్టడం మనం చూశాం. కానీ తాజాగా జరిగిన బీఏసీ మీటింగులో జరిగింది పూర్తిగా వేరు. బయట మీడియా ముందు పులిలా ప్రభుత్వంపై రెచ్చిపోయి మాట్లాడే సీఎల్పీ లీడర్ బీఏసీ మీటింగ్‌లో మాత్రం ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై కాకుండా క్లబ్ గురించి డిమాండ్ చేసి ప్రభుత్వానికి పూర్తిగా సహకరించారని అంటున్నారు. సీఎల్పీ నేత ఎంతలా ప్రభుత్వానికి సాగిలపడ్డారని అంటే ఎప్పుడైనా బడ్జెట్ సమావేశాలు కనీసం 14 రోజులు నడిపించాల్సి ఉంటుంది. అది అసెంబ్లీ రూల్ బుక్‌లో కూడా ఉంటుంది. కానీ ఈ బడ్జెట్ సమావేశాలు కేవలం 10 రోజులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం అప్పుడు కూడా భట్టి విక్రమార్క దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని తెలుస్తోంది. ఈ మధ్య భట్టి విక్రమార్క అన్ని జిల్లాలూ తిరుగుతూ ఆసుపత్రుల్లో వసతుల గురించి ఆరా తీస్తూ తర్వాత ప్రెస్‌మీట్లలో ప్రభుత్వాన్ని చెండాడేస్తుంటే.. ఇలాంటి లీడరు ఒక్కడుంటే చాలని ప్రజలు మురిసిపోయారు. తీరా అసెంబ్లీ సెషన్స్‌లో ఏఏ అంశాలు చర్చించాలనే టాపిక్ వచ్చినప్పుడు మాత్రం మాట రాని మౌన మునిలా భట్టీ విక్రమార్క కూర్చుంచిపోవడం, పైగా ఎమ్మెల్యేలకు ఆడుకోవడానికి క్లబ్ కావాలని దేబిరించడం చూస్తుంటే ఇలాంటి వారినా మనం చట్టసభకు ఎన్నుకున్నదీ అనిపిస్తుంది. ముందు బీజేసీలో డిసైడైతే రేపు సభలో ప్రశ్నించడానికి సమయం దొరుకుతుంది. అసలు ఇక్కడే ప్రజా సమస్యల్ని గాలికి వదిలేస్తే రేపు సభలో మాట్లాడతానంటే సభాపతి ఊరుకుంటారా? బీఏసీలో ఎందుకు దీని గురించి సమయం తీసుకోలేదూ అన్ని నిలదీయరూ..?
యూరియా దొరక్క రైతులు చనిపోతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షానికి ఇంతకు మించిన అవకాశం వుండదు. యురేనియం తవ్వకాలతో కృష్ణానది కలుషితం అవుతోంది. సీనియర్ నేత వీహెచ్ వెళ్లి ఈ సమస్యపై గళమెత్తడానికి సహకరించిండని జనసేనాని పవన్‌కల్యాణ్‌ని కలిసి మద్దతు అడిగివచ్చారు. ఈ సమస్యపై బయట ఎంత ఆందోళన చేసినా శాసనసభలో చర్చిస్తే ప్రభుత్వం నుంచి నేరుగా సమాధానం వస్తుంది. కానీ, భట్టి ఆ అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారు. ఏదీ అడగలేదు, క్లబ్బు గురించి తప్ప.
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ఏ హామీ కూడా ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. ‘రైతు బంధు’ బంద్ అయిపోయింది. 50శాతం మంది రైతులకు సహాయం అందలేదు. రుణమాఫీ అవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, పెన్షన్ వయస్సు తగ్గించలేదు.. ఇలా ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు. అలాంటప్పుడు ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు లాభం చేయాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ వదిలేసి ఒక క్లబ్ అడగడం చూస్తుంటే ఈ పెద్దమనిషికి ప్రజాసమస్యలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధం అవుతోంది. కొత్త సభ ఏర్పడి ఇప్పటికి 10 నెలలు అవుతోంది. ప్రతిపక్షానికి బలాన్నిచ్చే పీఏసీ కానీ, పీయూసీ కానీ ఏ ఒక్క కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కానీ భట్టికి ఈ విషయం గురిచి అడిగే తీరిక లేదు. క్లబ్ పెడితే అందులో ఏఏ సదుపాయాలు వుండాలో యాక్షన్ ప్లాన్ మాత్రం వున్నట్టుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సబితను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీనిపై చేసిన ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగా మంత్రిగా ఎలా తీసుకుంటారని గట్టిగా నిలదీయవచ్చు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనఃర్హత వేటు వేయండని స్పీకర్‌ను అడగాలి. అది కూడా భట్టికి తట్టలేదు. ఒక క్లబ్ అయితే అర్జెంటుగా కావాలి. అది మాత్రం అడిగారట. ఈ మధ్య బీజేపీ కాంగ్రెస్‌ను తరుచూ శిఖండి అని విమర్శిస్తోంది. బీఏసీలో భట్టి వ్యవహారం చూస్తే బీజేపీ ఆరోపణల్లో నిజం ఉందేమో అనిపిస్తోంది. రెండు రోజుల క్రితం సెంట్రల్ కోర్టు హోటల్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన జిల్లా నేతలతో భట్టి సమావేశాన్ని ఏర్పాటు చేసి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏ సమస్యలు చర్చించాలో అని ఒక నివేదికను తీసుకున్నారు. మరి ఆ సమావేశంలో ఎవరు ప్రజాసమస్యలు లేవనెత్తాలో చెప్పలేదా.. లేక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేదా.. ఎందుకు భట్టి ప్రజా సమస్యలు వదిలేసి ఒక క్లబ్ కావాలని ఆడిగారు… అని కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. పోరాటంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్‌నెస్ కోల్పోయిందేమోనని అనిపిస్తోందంటున్నారు. మీడియా ముందు మాత్రం ఏదో ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్న సభలో మాత్రం ‘మాకెంత మీకేంటి’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు.