రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరల విషయంలో ఆరాటాలు ఆర్భాటాలు చేస్తుంటారు అధికారులు. పంపిణీ చేసే బతుకమ్మ చీరలను కాపాడే విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. చీరలను ప్రొక్యూర్ మెంట్ చేసి నిల్వ ఉంచుతున్న అధికారులు.. అవి డ్యామేజ్ కాకుండా కాపాడటంలో విఫలం అవుతున్నారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్న చీరలు.. లబ్ధిదారుల చేతికి చెదలు పడుతున్నాయి. సిరిసిల్ల నేత కార్మికుల నుండి సేకరించిన బతుకమ్మ చీరలను.. చేనేత, జౌళిశాఖ అధికారులు సిరిసిల్ల పట్టణంలోని పలు గోదాముల్లో భద్రపర్చారు. ఇందులో ఇందిరానగర్ లోని మార్కెట్ యార్డు గోదాం కూడా ఒకటి. వీటిని భద్రపరిచిన చీరలు.. సిరిసిల్ల ఏఎంసీ ఆవరణలో చిరిగిపోయి ముక్కలుగా పడిపోతున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు.
గత సంవత్సరం కొత్త డిజైన్లలో చీరలు సరఫరా చేయాలని ప్రత్యేకంగా డిజైన్లను సూచించింది. కొత్తగా ఎంపిక చేసిన డిజైన్లలో చీరలు తయారు చేయాలంటే డాబీ, జకార్డ్ అనే పరికరాలు అవసరం. సాంచాలకులు బిగించాల్సిన వీటిని.. మహారాష్ట్ర, గుజరాత్ ల నుండి తెప్పించాల్సి వచ్చింది. ఈ పరికరాలను సిరిసిల్లకు రప్పించేసరికి ఆలస్యం కావడంతో సకాలంలో బతుకమ్మ చీరలు అందించలేకపోయారు.
అయితే.. వీసీఎండీ నుండి కూడా ఆర్డర్లు రావడంతో.. వాటిని టెక్స్ టైల్స్ డిపార్ట్ మెంట్ అధికారులు సేకరించారు. ఈ చీరలు కూడా సిరిసిల్లలోనే ఉండిపోవడంతో ఇక్కడ నిలవులు ఉన్నట్టుగా తెలుస్తోంది. గత సంవత్సరం దాదాపు రూ. 300 కోట్లు వెచ్చించి 6.80 కోట్ల మీటర్ల క్లాత్ సేకరించారు. సుమారు రూ. 50 కోట్ల విలువ చేసే 5 కోట్ల మీటర్ల క్లాత్ ఇక్కడి గోదాముల్లో స్టాక్ నిలిచిపోయింది. ఈ చీరలను సిరిసిల్లలోని గోదాముల్లో నిల్వ ఉంచిన అధికారులు వచ్చే సంవత్సరం పంపిణీ చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం.
దీంతో ఈ ఏడాది బతుకమ్మ చీరలను 5 కోట్ల మీటర్లకు పరిమితం చేశారు. అయితే.. నిల్వలు ఉంచిన చోట అవి డ్యామేజ్ కాకుండా ఉన్నాయా లేదా అన్న విషయంపై దృష్టి సారించేవారు లేకుండా పోవడం విడ్డూరం. సిరిసిల్ల మార్కెట్ యార్డు ఆవరణలో ఉంచిన చీరల పరిస్థితి ఎలా ఉందో చూస్తే అధికారులు ఎలాంటి శ్రద్ద వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చుని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.