ప్రధాని మోడీకి సంబంధించిన అంశాలపై విస్తృతంగా రీసెర్చ్ చేసిన తరువాతే తాము ఆయనపై డాక్యుమెంటరీ రూపొందించామని బీబీసీ ప్రకటించింది. అత్యంత ముఖ్యమైన విషయాలను హైలైట్ చేయవలసిన అవసరం ఉందని, ఈ దృష్ట్యా అత్యున్నత ఎడిటోరియల్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ ఇదని వెల్లడించింది. దీన్ని రూపొందిస్తున్నప్పుడు అనేకమందిని సంప్రదించామని, సాక్షులను, నిపుణులను కలుసుకున్నామని ఈ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం ఓ స్టేట్మెంట్ లో తెలిపారు.
మోడీపై బీబీసీ తీసిన ఈ డాక్యుమెంటరీ పై ఇండియాలో పెద్దఎత్తున విమర్శలు, దుమారం రేగడంతో ఈ సంస్థ ఈ వివరణ ఇచ్చింది. ‘ఇది కేవలం ప్రాపగాండా పీస్ అని, అసత్య ప్రచారానికి, వలసవాద ధోరణి, పక్షపాతానికి నిదర్శనంగా ఉందని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పు పట్టిన విషయం గమనార్హం. 2002 లో గుజరాత్ సీఎంగా మోడీ ఉండగా జరిగిన పరిణామాలంటూ బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.
అయితే తమ చర్యను ఈ సంస్థ సమర్థించుకుంటూ .. అనేకమంది నుంచి తాము అభిప్రాయాలను సేకరించామని, వారిలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సభ్యులు కూడా ఉన్నారని వివరించింది. మేం ఈ సీరీస్ తీస్తున్నప్పుడు ఇందులో లేవనెత్తిన అంశాలపై భారత ప్రభుత్వానికి సమాధానమిచ్చే హక్కును కూడా ఇచ్చాం.. కానీ స్పందించేందుకు ఆ ప్రభుత్వం నిరాకరించింది’ అని బీబీసీ అధికార ప్రతినిధి తెలిపారు. దీనికి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రపంచం చుట్టూ ఉన్న ముఖ్యమైన అంశాలను హైలైట్ చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇండియాలో మెజారిటీ సంఖ్యలో ఉన్న హిందువులకు, మైనారిటీలైన ముస్లిములకు మధ్య గల ఉద్రిక్తతలను పరిగణనలోకి తీసుకున్నామని, ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి, ఈ ఉద్రిక్తతలకు మధ్య ఉన్న సంబంధాలను మదింపు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీకి సంబంధించి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. మోడీకి మద్దతుగా తీవ్ర స్థాయిన స్పందించారు. పాకిస్థాన్ లో పుట్టి బ్రిటన్ లో స్థిర పడిన లేబర్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ హుసేన్ ఈ డాక్యుమెంటరీ గురించి ప్రస్తావిస్తూ మోడీపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.