ప్రధాని మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీని అపఖ్యాతి పాలు చేసేందుకు ఈ డాక్యుమెంటరీని తీశారని భారత్ మండిపడుతోంది. కుట్రలో భాగంగానే ఈ డాక్యుమెంటరీని తీశారంటూ భారత్ మండిపడుతోంది. ఈ మేరకు డాక్యుమెంటరీని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
డాక్యుమెంటరీని పరిశీలిస్తే బీబీసీ పక్షపాత వైఖరి, వలసవాద మనస్తత్వం చాలా స్పష్టంగా కనిపిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మండిపడ్డారు. ఈ డాక్యుమెంటరీ వెనుక ఉన్న ఉద్దేశం,దాని ఎజెండా గురించి ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ఇలాంటి డాక్యుమెంటరీలను తాము గౌరవించబోమన్నారు. “ఇండియా: ది మోడీ క్వశ్చన్” అనే పేరుతో బీబీజీ రెండు పార్టులుగా డాక్యుమెంటరీని రూపొందించింది. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు సంబంధించి పలు విషయాలపై తాము పరిశోధనలు చేశామని బీబీసీ వెల్లడించింది.
బ్రిటీష్ మాజీ విదేశీ కార్యదర్శి జాక్ స్ట్రా అడిగిన ప్రశ్నలపై అరిందమ్ బాగ్చి స్పందించారు. జాక్ స్ట్రా వ్యాఖ్యలకు బీబీసీ చట్టబద్ధత ఎలా ఆపాదిస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అనే పదాలు విన్నట్టు చెప్పారు. మనం వలసవాద మనస్తత్వం అని పేర్కోడానికి ఆ రెండు పదాలు చాలని ఆయన అన్నారు.
భారత్‌లో విచారణ జరపడానికి వారేమైనా దౌత్యవేత్తలా? లేదా మన దేశాన్ని వారేమైనా పాలిస్తున్నారా? అని ఆయన మండిపడ్డారు. డాక్యుమెంటరీని అలా చిత్రీకరించడాన్ని తాను అంగీకరించబోనన్నారు. ఆ డాక్యుమెంటరీ భారత్‌లో ప్రసారం కాలేదన్నారు. అందువల్ల తాను ఆ డాక్యుమెంటరీలోని విషయాలను సహచర ఉద్యోగులు ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. వాటిపైనే మాత్రమే మాట్లాడుతున్నానన్నారు.
ఈ డాక్యుమెంటరీపై బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చ జరిగింది. పాకిస్థాన్ సంతతికి చెందిన ఎంపీ ఒకరు దీని గురించి ప్రస్తావనకు తెచ్చారు. భారత ప్రధాని మోడీని ఉద్దేశించి ఆ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సున్నితంగా ఖండించారు. హింసను తాము ఎక్కడా ఎప్పుడూ సహించబోమన్నారు. కానీ ఓ దేశాధినేతను అలా చిత్రీకరించడాన్ని తాము అంగీకరించబోమన్నారు.
దౌత్య సంబంధాల విషయంలో తమ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందన్నారు. భారత్, బ్రిటన్ ల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. ఈ డాక్యుమెంటరీని బ్రిటన్ లోని ప్రవాస భారతీయులు కూడా తీవ్రంగా ఖండించారు.