ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై దుమారం రేగుతోంది. ఇప్పటికే పలు దేశాలు, పలువురు నేతలు దీనిపై స్పందించారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ స్పందించారు. 2022 గుజరాత్ అల్లర్ల విషయాన్ని వదిలిపెట్టాలని తాను ఎప్పుడూ దేశ ప్రజలను అడగలేదని ఆయన అన్నారు.
గుజరాత్ అల్లర్ల గాయాలు ఇంకా పూర్తిగా నయం కాలేదన్నారు. అయితే ప్రస్తుతం చాలా అత్యవసరమైన సమకాలీన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నపుడు పాత విషయాలపై చర్చించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదన్నారు.
ఈ విషాదాన్ని మరిచి భారత్ ముందుకు సాగిందన్నారు. రెండు దశాబ్దాలు గడిచినందున ఈ విషయాన్ని ప్రజలు మరిచిపోయి ముందుకు సాగాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా తన తీర్పును ఇచ్చిందని పేర్కొన్నారు.
అధికారిక పరిశోధనల ద్వారా పూర్తి నిజం నిజంగా వెల్లడి కాలేదని కొంత మంది నమ్ముతున్నారని ఆయన అన్నారు. అలా నమ్మే వారిపై తాను ఎలాంటి విమర్శలు చేయడం లేదన్నారు. ఇతరులు తన అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చునని ఆయన పేర్కొన్నారు.