భారత చట్టాలను బీబీసీ విధిగా పాటించాల్సిందేనని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ .. బ్రిటన్ కు ఖరాఖండిగా చెప్పారు. ఇండియాలో పని చేస్తున్న బ్రిటన్ సంస్థలన్నీ ఇక్కడి నిబంధనలు, చట్టాలను పాటించి తీరవలసిందేనని ఆయన బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ కి స్పష్టం చేశారు. జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ చేరుకున్న జేమ్స్ క్లెవర్లీ తో ఆయన బుధవారం రెండు సార్లు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
చర్చల సందర్భంగా జేమ్స్..ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులను ప్రస్తావించగా.. జైశంకర్..నిర్మొహమాటంగా ఈ విషయాన్ని చెప్పారు. జేమ్స్ తో భేటీ అయిన అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ .. బ్రిటన్ విదేశాంగ మంత్రితో తాను రెండు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించానని, భారత, బ్రిటన్ దేశాలమధ్య సంబంధాల పురోగతిని తాము సమీక్షించామని తెలిపారు.
ఇదివరలో దీనికి సంబంధించి తమ ఇద్దరి మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఈ సమావేశాలు జరిగాయన్నారు. ముఖ్యంగా రెండు దేశాల్లో అమలు చేయదలచిన ‘యంగ్ ప్రొఫెషనల్ స్కీం’ గురించి కూడా తాము ప్రస్తావించినట్టు జైశంకర్ తెలిపారు.
2002 లో గుజరాత్ సీఎంగా మోడీ ఉండగా జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు భాగాలుగా డాక్యుమెంటరీని రూపొందించి రిలీజ్ చేసింది. అయితే ఇండియాలో దీన్ని కేంద్రం నిషేధించిన తరువాత .. హఠాత్తుగా ఢిల్లీ, ముంబై సిటీల లోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ మూడు రోజులపాటు దాడులు నిర్వహించింది. బీబీసీ పెద్దఎత్తున ఆదాయపు పన్ను చెల్లించకుండా ఎగవేసిందని ఐటీ అధికారులు ఆ తరువాత వెల్లడించారు. కానీ బ్రిటన్ ప్రభుత్వం బాహాటంగానే బీబీసీని సమర్థిస్తూ.. భారత ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తెచ్చినట్టు తమ పార్లమెంటులో ప్రకటించింది. హౌస్ ఆఫ్ కామన్స్ లో జరిగిన చర్చ సందర్భంగా ..’ఇండియాలో బీబీసీ ఆఫీసులపై దాడులు’ అంటూ ఎంపీ డేవిడ్ రూట్లే పెడబొబ్బలు పెట్టారు.