– రెచ్చిపోయిన కొడంగల్ ఎమ్మెల్యే?
– బీసీ సర్పంచ్ ను అవమానిస్తూ కార్యక్రమం, దాడి?
– నరేందర్ రెడ్డిపై మహిళా, బీసీ సంఘాల ఆగ్రహం
– నియోజకవర్గంలో అరాచకాలు పెరిగాయంటూ ఫైర్
ఇది నా రాజ్యం.. నేను చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అంటూ కొడంగల్ లో పాలన సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనే అందుకు నిదర్శనమని చెబుతున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బీసీలు, మహిళలంటే అసలు గౌరవం లేదని అంటున్నారు. బీసీ, మహిళా సర్పంచులు, అధికారులను చులకనభావంతో చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామ సభల పేరుతో మహిళా సర్పంచులను తీవ్రంగా అవమానిస్తున్నారని.. కనీసం సమాచారం లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు.
మద్దూర్ మండలం దోరేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గ్రామ సభ నిర్వహించారు. ఆ గ్రామ సర్పంచ్ చంద్రకళ.. బీసీ మహిళ కావడంతో కనీసం ఆమెకు సమాచారం ఇవ్వకుండానే గ్రామసభ జరిపారట. ఇదేంటని సర్పంచ్ నిలదీస్తే ఎమ్మెల్యే అధికార దర్పాన్ని చూపించారని అంటున్నారు. నువ్వు మహిళా సర్పంచ్.. నేను ఎమ్మెల్యేని.. ఎలాగైనా గ్రామసభ నిర్వహిస్తా.. ఏం చేస్తావ్ అంటూ దురుసుగా ప్రవర్తించారట. దీనిపై ఆమె గట్టిగా నిలదీయడంతో తన రౌడీలను పంపించి తన ఇంటిపై పట్నం దాడి చేయించారని చెబుతున్నారు చంద్రకళ.
తమ గ్రామంలో ఏ అభివృద్ధి చేద్దామన్నా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని అంటున్నారు చంద్రకళ. కోటి రూపాయలు పంచాయతీలో ఉన్న గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నామని బోరున విలపిస్తున్నారు. కనీసం సీసీ రోడ్లు వేద్దామన్నా ఇసుకకు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. తన ఊర్లో వాగు ఉన్నా.. రోడ్ల ఇసుకను తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. కానీ.. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మనుషులు మాత్రం అక్రమంగా ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతీదాంట్లో కమిషన్ అడిగితే ఎక్కడినుంచి ఇవ్వాలని సర్పంచ్ చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కమిషన్ ఇవ్వడం లేదని గ్రామ పనులను హైదరాబాద్ కాంట్రాక్టర్ కు ఇచ్చి చేయించాలని ఎమ్మెల్యే చూస్తున్నారని అన్నారు.
నిన్నటి వరకు కల్యాణ లక్ష్మి చెక్కుల్లో కమిషన్ తీసుకునే ఎమ్మెల్యే.. ఇప్పుడు దళిత బంధులో కూడా ఒక్కొక్కరి నుంచి 2 లక్షలు వసూలు చేస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు అగ్రకుల అహంకారంతో బీసీ మహిళలను అవమనిస్తున్నారని.. పట్నం నరేందర్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని అంటున్నాయి బీసీ సంఘాలు.