వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు నమోదు అయ్యింది. అణగారిన వర్గాల నుండి వచ్చిన ఉద్యోగులను కించపరుస్తూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై జాతీయ బీసీ సంఘం అధికార ప్రతినిధి దాసు సురేష్ హెచ్‌ఆర్సీలో ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ఫిర్యాదు చేశారు. బీసీ, దళిత వర్గాల ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత స్పందించాలని డిమాండ్ చేస్తూ… బీసీ, దళిత వర్గాలను కించపర్చిన చల్లా ధర్మారెడ్డిని మళ్లీ పోటీచేయకుండా అభిశంసించాలని డిమాండ్ చేశారు. సీఎంకు మా వర్గాలపై ఏమాత్రం ప్రేమున్నా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాముడి పేరుతో బీజేపీ నేతలు దొంగ బుక్కులు తయారు చేసి, చందాలు చేస్తున్నారంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విమర్శలు చల్లారకముందే ఓసీ గర్జనలో ధర్మారెడ్డి ఇతర కులాలను విమర్శించారు. ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదు.. ఎక్కడ చూసినా వాళ్లే ఉన్నారు. మొత్తం నాశనం చేస్తున్నారు అంటూ కామెంట్ చేశాడు.
అయితే, దీనిపై తీవ్ర విమర్శలు రావటంతో ధర్మారెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాడు.