బీసీలు యాచించే స్థాయి నుండి, శాసించే స్థాయికి ఎదగాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యం అవుతుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీపీ మండల్ డే సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల్ సిఫార్సుల మేరకే దేశంలో ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యాయని చెప్పారు.
ఈ సందర్భంగా బీసీల రాజకీయ వేదికకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు శ్రీనివాస్ గౌడ్. రాజకీయంగా బీసీలను అంటరానివాళ్లుగా అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
రాష్ట్రంలో దొరల, పటేళ్ల పాలన సాగుతోందని విమర్శించారు. 2023లో బీసీని ముఖ్యమంత్రిని చేసి దొరల పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా డిసెంబరు 12న హైదరాబాద్ లో 50 వేల మందితో బీసీ రాజకీయ ప్లీనరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు జాజుల శ్రీనివాస్.