నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు ఓటు వేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది. టీఆర్ఎస్ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం గొప్ప విషయంగా అభివర్ణిస్తూ.. భగత్ బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి అయినందున ఆయన్ను గెలిపించాలంటూ ఆర్. కృష్ణయ్య కోరడం పట్ల బీసీ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కారణాలు, సానుభూతిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్.. భగత్‌కు టికెట్ కేటాయించినంత మాత్రానా.. బీసీలపై ప్రేమతో కేసీఆర్ అవకాశం ఇచ్చినట్టుగా ఆర్. కృష్ణయ్య పొగడ్తలు కురిపించడంపై పలువురు బీసీ నాయకులు మండిపడుతున్నారు.
పార్టీకి సంబంధం లేని ఎవరో సామాన్య బీసీ వ్యక్తికి పిలిచి టికెట్ ఇవ్వలేదని.. ఇచ్చింది నోముల కుమారుడికే అన్న విషయాన్ని గుర్తించాలని ఆర్. కృష్ణయ్యకు హితవు పలుకుతున్నారు. బీసీలు ఎన్నో సమస్యలతో సతమతం అవుతోంటే.. సాగర్ ఉప ఎన్నికను ముందు పెట్టి అయినా.. వాటిని పరిష్కారించాలని కేసీఆర్‌ను డిమాండ్ చేయాల్సింది పోయి.. టీఆర్ఎస్‌కే ఓటు వేయాలని ఎలా కోరుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్. కృష్ణయ్య టీఆర్ఎస్ పార్టీ బీసీ శాఖకు అధ్యక్షుడు కాదని.. ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ కులాలన్నింటికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విషయాన్ని మర్చిపోయారా అని మండిపడుతున్నారు.