తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీసీల తరపున పార్టీని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఇప్పుడున్న ఏ పార్టీ కూడా బీసీ జనాభాకు తగినట్టుగా సభ్యులను చట్ట సభలకు పంపడం లేదని ఆరోపించిన కృష్ణయ్య.. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో కృష్ణయ్య ఈ విషయాన్ని ప్రకటించారు. సమావేశానికి హాజరైన సభ్యులంతా ఆర్. కృష్ణయ్యను బీసీల కోసం పార్టీ ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగితే తప్ప బీసీల అభివృద్ధి సాధ్యం కాదంటూ ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు. దీంతో ఆయన పార్టీ ఏర్పాటుకు సముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
కాగా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు కృష్ణయ్య. అయితే క్రమంగా పార్టీ వ్యవహారాలకు మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత పూర్తిగా టీడీపీని వీడారు.