మార్చి 2020.. కరోనా ప్రభావం దేశంలో అప్పుడే నెమ్మదిగా మొదలైంది. తీవ్రత పెరుగుతుందేమోనని చెప్పి కేంద్ర ప్రభుత్వం మార్చి చివర్లో మొదటి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 14 నుంచి జరగాల్సిన ఐపీఎల్ 13వ ఎడిషన్ వాయిదా పడింది. తరువాత దేశంలో కరోనా విషయంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో బీసీసీఐ అటు ఐపీఎల్‌ను కూడా నిరవధికంగా వాయిదా వేసింది. ఈక్రమంలోనే అసలు ఐపీఎల్ ఈసారి జరుగుతుందా, లేదా ? అని అందరికీ అనుమానాలు వచ్చాయి.
కాగా బీసీసీఐకి ఐపీఎల్ జరగకపోతే రూ.4వేల కోట్లు నష్టం వస్తుందని తెలిసి టోర్నీని భారత్‌లో కాకుండా యూఏఈలో నిర్వహించారు. దీంతో జూలైలో ఈ విషయం నిర్దారణ అయింది. తరువాత టోర్నమెంట్ మొత్తాన్ని అక్కడికే మార్చి అక్కడే మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించారు. నవంబర్ 10న ఐపీఎల్ ఫైనల్ జరగ్గా.. అందులో ఢిల్లీపై ముంబై ఘన విజయం సాధించి ట్రోఫీని 5వ సారి కైవసం చేసుకుంది.
ఇక ఐపీఎల్ జరగడంతో బీసీసీఐకి రూ.4వేల కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే రికార్డు స్థాయిలో ఐపీఎల్ మ్యాచ్‌లు వ్యూయర్‌షిప్‌ను సాధించాయి. ముంబై, చెన్నైల మధ్య జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో ప్రేక్షకులు చూశారు. కాగా ఇదే విషయంపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. గతేడాది కన్నా ఈసారి వ్యూయర్‌షిప్ 25 శాతం పెరిగిందని, ముంబై, చెన్నైల మధ్య జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ వచ్చిందన్నారు. ఇక ఈ సారి ఐపీఎల్ ద్వారా రూ.4వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
కాగా ఐపీఎల్ నేపథ్యంలో బీసీసీ మొత్తం 1500 మంది సిబ్బందిని అక్కడ నియమించింది. అలాగే మొత్తం 30వేల కోవిడ్ టెస్టులు చేసింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పకడ్బందీగా టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఈ క్రమంలో కరోనా ఉన్నప్పటికీ బీసీసీఐకి మాత్రం ఐపీఎల్ ద్వారా భారీ ఎత్తున ఆదాయం వచ్చింది. ఇక ఐపీఎల్‌కు గాను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ రూ.100 కోట్లను చెల్లించింది.