మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో లలిత్ మోడీ సహజీవనం వార్తల నేపథ్యంలో ఈ జంటపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. దీంతో పాటు ఐపీఎల్ ఆరోపణలపైనా లలిత్ మోడీని నెటిజన్లు తెగ ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై లలిత్ మోడీ మండిపడుతున్నారు.
తాను చేరినప్పుడు బీసీసీఐ బ్యాంకు బ్యాలెన్స్ రూ. 40 కోట్లుగా ఉండేదని ఐపీఎల్ ఫౌండర్, మాజీ చైర్మన్ లలిత్ మోడీ అన్నారు. తాను వచ్చాక ఆ బ్యాలెన్స్ ను రూ. 47 వేల 680 కోట్లకు తీసుకు వెళ్లానని ఆయన అన్నారు. ఈ విషయంలో బీసీసీఐలో ఎవరూ తనకు సహాయం చేయలేదన్నారు.
ఐపీల్ పై ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండబోదని తాను 2008లో చెప్పినప్పుడు అంతా నవ్వుకున్నారని ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు బీసీసీఐలో కూర్చుని ఐపీల్ లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. తాను సంపన్న కుటుంబంలో జన్మించానని, తనకు లంచాలు తీసుకోవాల్సిన పనిలేదన్నారు.
తాను రాయ్ బహద్దూర్ గుజర్ మల్ మోడీ ముని మనవడని గుర్తు చేశారు. తాను డబ్బుతోని వచ్చాను కానీ డబ్బుతో పారిపోలేదన్నారు. తాను ప్రజా ధనంతో లేదా ప్రభుత్వం ధనంతో పారిపోలేదని స్పష్టం చేశారు. తాను ఐపీఎల్ ద్వారా బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచానే తప్పా వాటితో పారిపోలేదన్నారు.