భారత క్రికెట్ బోర్డుకు కాసుల వర్షం కురిపించే టోర్నీ ఐపీఎల్. ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేమికులంతా టీవీలకు అతుక్కుపోతారు. ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లతో దేశీయ ఆటగాళ్ల పోటీ… క్షణక్షణం ఉత్కంఠ అభిమానులను అలరిస్తుంది. అయితే… ఈసారి కరోనా వైరస్ దెబ్బకు ఐపీఎల్ ఏప్రిల్ వరకు వాయిదా పడింది. విదేశీయులకు భారత్‌లోకి ప్రవేశం నిషేధించటంతో విదేశీ ఆటగాళ్లు దూరం కాగా…. జనసంద్రోహం ఎక్కువగా ఉండకూడదన్న నిబంధనతో రాష్ట్ర ప్రభుత్వాలు ఐపీఎల్‌కు అనుమతి నిరాకరించాయి.
అయితే… చూస్తూ చూస్తూ వేల కోట్లను వదులుకోవటం ఇష్టంలేని బీసీసీఐ, అధ్యక్షుడు గంగూలీ… కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టాక అయినా ఐపీఎల్ ఉండాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నాడట. అవసరమైతే జులై నుండి కానీ లేదా సెప్టెంబర్ నుండి కానీ నెలన్నర రోజుల పాటు టోర్నీ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ వరకు ప్రస్తుతం వాయిదా పడ్డప్పటికీ… పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే సద్దుమణిగే అవకాశం లేదని, అందుకే ఇతర అవకాశాలపై బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుందని ఎనలిస్టులు సైతం భావిస్తున్నారు. కానీ కొత్త షెడ్యూల్ అంటే అంతర్జాతీయ మ్యాచ్‌లన్నీ రీషెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. సంవత్సరాల ముందే కొన్ని టోర్నీలు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. దీంతో గంగూలీ ఎత్తులకు ఐసీసీ, విదేశీ క్రికెట్ బోర్డులు ఎంతమేరకు మొగ్గుచూపుతారో చూడాలి.