క్రికెట్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వార్త వచ్చేసింది. ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. దేశంలోని ఆరు నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో ఈసారి టోర్నీ జరగనుంది. కాగా హైదరాబాద్‌కు మొండి చేయి తప్పలేదు. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిని కూడా బీసీసీఐ పట్టించుకోలేదు.
ఐపీఎల్- 2021 ఏప్రిల్ 9న చెన్నైలో ప్రారంభం కానుంది. చెన్నైలోనే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మొత్తం ఈ సీజన్‌లో 56 మ్యాచ్‌లు జరగనుండగా.. 10 మ్యాచ్‌ల చొప్పున చెన్నై, ముంబై, కోల్‌కత్తా, బెంగూరులో నిర్వహించనున్నారు. ఇక మిగిలిని పదహారింటిలో.. 8 మ్యాచ్‌లు అహ్మదాబాద్, మరో 8 ఢిల్లీలో జరుగుతాయి. ఇక మే 30న జరిగే ఫైనల్ మ్యాచ్‌ను అహ్మాదాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఈ సారి ఆడే జట్లు ఏ ఒక్కసారి కూడా తమ హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడటం లేదు. మ్యాచ్‌లన్నీ కూడా తటస్థ వేదికలపైనే జరిగేలా బీసీసీఐ షెడ్యూల్ డిజైన్ చేసింది.