టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకుంటాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారని అంటున్నారు. కానీ ఇప్పుడు బీసీసీఐ కార్యదర్శి జే షా ఈ ఊహాగానాలన్నింటికీ ముగింపు పలికారు. ఆ వార్తలన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు. ప్రస్తుతం జట్టు కెప్టెన్సీ గురించి ఆలోచించడం లేదని ఆయన అన్నారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ “మేము అసలు అలాంటి ప్రతిపాదన చేయలేదు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో జుట్టు బాగా రాణిస్తోంది” అని అన్నారు. ఇక బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ చేసిన ప్రకటనతో షా ఏకీభవించారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో విరాట్ స్థానంలో రోహిత్ కెప్టెన్సీ అనే నివేదికలు చాలా దారుణంగా ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అక్టోబర్ నవంబర్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, ఒమన్ లో జరిగే టి20 ప్రపంచకప్ తర్వాత వన్డే, టీ-20 ఫార్మెట్లో కెప్టెన్సీ పదవి నుండి తప్పుకుంటారని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. వాటన్నిటికీ ఇప్పుడు షా తన ప్రకటనతో చెక్ పెట్టేశారు.
నెక్స్ట్ ఇంగ్లండ్ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టుతో రెండు అదనపు టి20 మ్యాచ్ ఆడడానికి భారతదేశం సిద్ధంగా ఉందని బీసీసీఐ కార్యదర్శి స్వయంగా వెల్లడించారు. జూలై 2022 లో మూడు మ్యాచ్ ల టి-20, వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ లో ఆడడానికి టీం ఇండియా వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వెళ్లనుంది. ఈ సిరీస్ జులై 1 నుండి 14 వరకు కొనసాగుతుంది.