దేశంలో కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న కేంద్రం.. ఆందోళన అనవసరమని, అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండియాలో కోవిడ్ కి చెందిన కొత్త ఎక్స్ బీబీ. 1.5 వేరియంట్ కేసులు ఏడుకు పెరిగాయని, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఇవి బయట పడ్డాయని కేంద్రం వెల్లడించింది. గుజరాత్ లో మూడు, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్టు ఇండియన్ సార్స్ కొవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం పేర్కొంది.
ఈ వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్ బీబీ వేరియంట్ కి సంబంధించినదని, ఇందులో మరికొన్ని సబ్ వేరియంట్లు కలిసి ఉన్నాయని వివరించింది. ఇవి అమెరికాలో 44 శాతం కేసుల పెరుగుదలకు కారణమవుతున్నట్టు ఈ సంస్థ తెలియజేసింది. డిసెంబరు 24-జనవరి 3 మధ్య విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన 124 మందికి పైగా ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి.
వీరికి నిర్వహించిన టెస్టుల్లో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కనిపించాయి. ఇవి లోగడ ఇండియాలో కనుగొన్నవే అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఏమైనా.. ఈ వేరియంట్లపై వదంతులు తగదని పేర్కొన్నాయి.
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 180 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు. కోవిడ్ వేరియంట్లు వస్తూనే ఉంటాయి.. కానీ వీటిలో ఏది తీవ్రంగా ఉండవచ్చు అన్నది ముఖ్యం.. ప్రభుత్వ వర్గాలు షేర్ చేసిన సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలి అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు వీటికి సంబంధించిన పుకార్లను నమ్మరాదని ఆయన చెప్పారు.