బాబా వేషంలోఎంట్రీ ఇచ్చాడు. మహిళలతో మృదువుగా మాటకలిపాడు. మత్తుమందు కలిపిన పసుపు,కుంకుమ చల్లి మైకంనుంచి తేరుకునే లోపే బంగారంతో ఉడాయించాడు. ఇదీ హైదరాబాద్ లో హల్ చల్ చేసిన ఓ బురిడీబాబా నేరపరంపర.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీలో వరలక్ష్మి-రాము దంపతులు నివసిస్తున్నారు. రాము ఓ చిరువ్యాపారి. అయితే ఓ వ్యక్తి కాషాయ దుస్తులు ధరించిన బాబా వేషంలో వరలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించాడు.
ఆమెతో మాట కలుపుతూ వెంట తెచ్చుకున్న మత్తుమందు చల్లాడు. దీంతో వరలక్ష్మి అతడు చెప్పినట్లు ఆడింది. తన మెడలో ఉన్న గొలుసు తీసి బాబాకు ఇచ్చింది. గొలుసు తీసుకున్న బాబా మెల్లగా బయటకు వెళ్లిపోయాడు.
ఇంత జరుగుతున్నా ఆమెకు ఏమాత్రం స్ఫృహలో లేకపోవడం గమనార్హం. ఇక్కడ బంగారం దోచుకున్న నేరస్తుడు పక్క ఉన్న రెండిళ్లలోకి కూడా వెళ్లాడు దొంగ బాబా. కానీ అక్కడ వర్కవుట్ కాలేదు. ఎవరూ బురిడీ బాబా మాటలగారడీలో పడలేదు.
సకాలంలో మహిళ భర్త రావడంతో దొంగ అక్కడ నుంచి జారుకున్నాడు. ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఈ దొంగ బాబా చోరీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగబాబు కోసం గాలిస్తున్నారు. ఇతగాడు ఇంకా ఎలాంటి పద్ధతుల్లో దోచుకున్నాడనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు..సిసి కెమెరాల ఏర్పాటు నేరాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. కాగా, బురిడీ బాబాను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఇంద్రప్రస్తా కాలనీలో మహిళ మెడలో నుండి మంగళ సూత్రాన్ని లాక్కిళ్లిన బురిడీ బాబాను నందనవనం లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.