కరోనా వైరస్‌ను కూడా కల్తీగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా శానిటైజర్లు, మాస్కులవరకే పరిమితమైన నకిలీలు.. ఇప్పుడు వ్యాక్సిన్లలోకీ వచ్చేశాయి. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఫేక్ వ్యాక్సిన్లు పంపిణీ అవుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కోవిషీల్డ్ టీకాల్లో డూప్లికేట్లు మార్కెట్లలో అమ్ముడవుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు కొన్ని నకిలీ వ్యాక్సిన్లను ఉగాండ, భారత్‌లో గుర్తించినట్టుగా WHO ప్రకటించింది. జులై, ఆగస్టులలో ఇందుకు సంబంధించిన నివేదికలు తమకు అందినట్టుగా వెల్లడించింది.
సీరం ఇనిస్టిట్యూట్ తయారుచేస్తున్న కోవిషీల్డ్ టీకాలను పోలినట్టుగా ఈ నకిలీలు ఉత్పత్తి అవుతున్నట్టుగా WHO తెలిపింది. ఉగాండలో గుర్తించిన నకిలీ కోవిషీల్డ్ టీకాలపై లేబుళ్లు గడువు ముగిసిపోయి ఉన్నాయని చెప్పింది. బ్యాచ్ నెంబర్ 4121Z040 పేరుతో ఇవి సర్క్యూలేట్ అవుతున్నట్టు వెల్లడించింది. ఇక ఇండియాలో కోవిషీల్డ్ టీకాను 2 మిల్లీ లీటర్ల సామర్థ్యంతో నాలుగు డోసులుగా నేరగాళ్లు విక్రయిస్తున్నట్టు తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బయటపెట్టింది. నకిలీ టీకాలు ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించడమేగాక.. అదనపు సమస్యలను తీసుకొస్తాయని హెచ్చరించింది. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ నకిలీలపై దృష్టిసారించాల్సిన అవసరముందని సూచించింది.