హెర్డ్ ఇమ్యూనిటీ ( సామాజిక వ్యాధి నిరోధకత) భావనే భారతీయుల కొంప ముంచిందా? రెండో దశలో కరోనా తీవ్రంగా విజృంభించడానికి అదే కారణమైందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. దేశంలో చాలా మంది ప్రజలు తమ శరీరంలో సహజ నిరోధకతను సాధించామనే భ్రమలో ఉండి.. ఈ మహమ్మారి బారినపడాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఏప్రిల్-మేలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడానికి ఇదే కారణమని చెబుతున్నారు.
తాజాగా CSIR- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఆధ్వర్యంలో “కరోనాతో నేర్చుకున్న- నేర్చుకోని పాఠాలు“ అనే అంశంపై జరిగిన సదస్సులో వైద్యరంగానికి చెందిన అనుభవజ్ఞులు, నిపుణులు కీలక అంశాలను పంచుకున్నారు. కరోనా నియంత్రణలో భారత్ ఎలా విఫలమైందనే విషయంపై తమ అభిప్రాయాలను కొండబద్ధలు కొట్టారు. కరోనా విషయంలో ప్రజలను ప్రభుత్వం.. నిర్బంధం నుంచి నిర్లక్ష్యం వైపు ఎలా నడిపించిందో, కొత్త వేరియంట్లకు ఎలా కారణమైందో వివరించారు.
పాజిటివ్ కేసుల సంఖ్య పరిమితంగా ఉన్నప్పుడు సుధీర్ఘమైన లాక్‌డౌన్ విధించి ప్రయాణాలపై ఆంక్షలు విధించి కరోనాను కట్టడి చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత దాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో ఘోరంగా విఫలమైందని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ స్వేచ్ఛగా ప్రయాణించడానికి వీలు కల్పించి.. ప్రభుత్వాలు అతిపెద్ద తప్పు చేశాయని వారు ఆక్షేపించారు. కరోనా వైరస్‌ను నియంత్రించాలనుకోవడం బహుదూరపు ఆలోచగా అభివర్ణించారు.
లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత.. హెర్డ్ ఇమ్యూనిటీ భావన పెరిగిపోయిందని, చాలా మంది నిపుణులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం పెద్ద తప్పిదానికి కారణమైందని వారు వివరించారు. ఇక బయట తిరిగినా తమకు ఏం కాదనే ఆలోచనతో ఇష్టారాజ్యంగా వ్యవహారించారని గుర్తు చేశారు. ఫలితంగా ఎవరికి వారు గుంపుల్లో తిరగడం.. వ్యాధి తీవ్రతను మరింత పెంచారని అన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీపై నిపుణుల మాటలను రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు కూడా ఆ మాటలను నమ్మారని.. ప్రజలు కూడా సాధారణ పరిస్థితులు కోరుకోవడంతో జనవరి నుంచి మామూలు పరిస్థితుల్లోకి వచ్చారని గుర్తు చేశారు.
కరోనా వెళ్లిపోయినట్టేనని అందరూ భావించి.. వారికి తెలియకుండానే మరింత మూలల్లోకి దాన్ని తీసుకెళ్లారని చెప్పారు. వాస్తవానికి వైరస్ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకునే చర్యలు తీసుకుని ఉంటే.. ఇంతటి ప్రమాదాన్ని దేశం ఎదుర్కొని ఉండేది కాదని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏ మాత్రం వివేచన లేకుండా ప్రభుత్వాలు వివిధ ఎన్నికలు నిర్వహించడం మరింత విపత్తుకు దారి తీసిందని స్పష్టం చేశారు.
అసలు హెర్డ్ ఇమ్యూనిటీ.. ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లే సాధనం కాదని నిపుణులు వివరించారు. సెరో సర్వేల్లో దేశవ్యాప్తంగా 67 శాతం మంది హెర్డ్ ఇమ్యూనిటీ సాధించారని చెప్పారని.. కానీ అది మూడు నుంచి ఆరువారాల కంటే ఎక్కువ రోజులు ఉండే చాన్సుందన్న విషయాన్ని ప్రచారం చేయలేకపోయారని తెలిపారు. ప్రస్తుతం వైరస్ నిర్మూలన చేయడం కంటే.. వ్యాక్సినేషన్ వేగం పెంచడం ఉత్తమం అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో నిత్యం 3నుంచి 4 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారని.. దీన్ని 8 మిలియన్లకు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొత్త వేరియంట్ల రాకుండా జాగ్రత్తపడకుండా.. వైరస్ నిర్మూలన అసాధ్యమని నొక్కిచెప్పారు.
మరోవైపు కేసులను తక్కువ చేసి చూపించడం కూడా వైరస్ వ్యాప్తి పెరగడానికి కారణమవుతోందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు కచ్చితంగా సరైన కేసులు, మరణాల లెక్కలను రికార్డు చేయాలని సూచించారు. ఇక ప్రభుత్వ వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంకొందరు తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో ఏం చేయాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలని.. అప్పుడే ఇలాంటి ఇతర మహమ్మారులు ఇంకెన్ని వచ్చినా అడ్డుకోవడం సాధ్యమవుతుందని వారు చెప్పుకొచ్చారు.