కేంద్ర బడ్జెట్ పై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్ అని.. అందమైన మాటలు తప్ప.. నిధుల కేటాయింపులో డొల్లనే అని అన్నారు. 7 ప్రాధాన్యత రంగాలుంటే వాటిని కేంద్రం గాలికి వదిలివేసిందన్నారు. దేశ రైతాంగాన్ని, అభివద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే బడ్జెట్ ఇదని మండిపడ్డారు హరీశ్ రావు.
తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్ ఇదని అన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాటలేదని.. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమేనని అన్నారు. విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలోని నేతన్నలకు సంబంధించి జీఎస్టీ రాయితీలు కానీ, వారికి ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వడం కానీ చేయలేదన్నారు. కొత్త రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనేకసార్లు కోరామని.. కానీ, ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదు.. ఈ బడ్జెట్‌లో కూడా ఇస్తామన్నది ఏమీ లేదని మండిపడ్డారు ఆయన.
పారిశ్రామిక వాడలకు సంబంధించి తెలంగాణకు ఒక్కటంటె ఒక్కటి కూడా కొత్తగా ఇస్తామన్నది లేదన్నారు. బడ్జెట్‌లో రైతులకు సంబంధించిన నిధుల్లో భారీగా కోత పెట్టారన్నారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించి, గ్రామీణ ఉపాధి హామి నిధుల్లో కోత పెట్టారని, ఆహార సబ్సిడీలు తగ్గించారని ఫైర్ అయ్యారు. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తామని చెప్పలేదన్నారు. ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా ఏమీ లేవని పెదవి విర్చారు మంత్రి హరీశ్ రావు.
ఉద్యోగులను సైతం భ్రమల్లో పెట్టారని.. ఇక సెస్సుల భారం తగ్గించలేదన్నారు. పన్నుల భారం నుంచి ఉపశమనం లేదని.. మొత్తానికి ఇదో భ్రమల బడ్జెట్ అని మంత్రి హరీశ్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. పేదల వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. తెలంగాణకు మోదీ సర్కార్ మొండి చేయి చూపించిందని చెప్పారు. కేంద్రం వసూలు చేసే మొత్తం పన్నుల ఆదాయంలో 30.4శాతం మాత్రమే రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నదని హరీశ్ రావు అన్నారు. నిజానికి, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41శాతం రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు.
సెస్సులు, సర్ ఛార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా చాలా తగ్గిపోతుందని చెప్పారు. చెబుతున్నది 41శాతం అయినా, రాష్ట్రాలకు నిజంగా అందుతున్నది మాత్రం 30శాతమేనని ఆరోపించారు. మరోవైపు పన్నుల్లో వాటా పెంచడం, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటాను పెంచడం, వివిధ కేంద్ర ప్రాయోజిత ప్రభుత్వ పథకాలను కుదించడం జరిగింది. ఈ విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రకాలుగా నష్టపోతున్నాయని ఆయన మండిపడ్డారు.