తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని శాతావాహన యూనివర్సిటీ పరిసరాల్లో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీలోని గుట్టల్లో ఎలుగుబంటి ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది అర్థరాత్రి సమయాల్లో యూనివర్సిటీ పరిసరాల్లో తిరుగుతున్నట్లు కెమెరాకు చిక్కింది.
దీంతో వర్సిటీకి చెందిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఎలుగు అడుగు జాడలను గుర్తించే పనిలో పడ్డారు. అలాగే ఎలుగుబంటి సంచారంతో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వర్షాల కారణంగా ఎలుగుబంట్లు, ఇతర జంతువులు జనావాసాల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాగే జరిగితే యూనివర్సిటీకి రావడానికి భయంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు.
జిల్లా కేంద్రంలోని అటవీ ప్రాంతం గ్రానైట్ పరిశ్రమ పేరుతో నాశనం అవ్వడంతోనే ఇలా అడవి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. ప్రకృతి విధ్వంసం వల్ల వాతావరణంలోని మార్పులు వల్లే ఇలా జరుగుతోందని సమాచారం.