సహజంగా వన్యమృగాలను అటవీ ప్రాంతాల్లో లేదా జూ పార్కుల్లో చూస్తుంటాం. కానీ.. ఈ మధ్య కాలంలో అవి కూడా జనారణ్యంలో తిరుగుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతం నుంచి పులులు, జింకలు వస్తుంటే.. శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగులు, ఎలుగుబంట్లు బయటకొచ్చి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది.
కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అకాడమిక్ బిల్డింగ్ సమీపంలోని బాయ్స్ హాస్టల్ 2 వద్ద విద్యార్థులకు ఎలుగుబంటి కనిపించింది. దీంతో విద్యార్ధులు వణికిపోయారు. అయితే.. అది సమీపంలోని శేషాచలం కొండల నుంచి క్యాంపస్ లోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఐటీ ఆర్కే వ్యాలీలోని క్యాంపస్ లో దాదాపు 5000 మంది విద్యార్థులు ఉంటారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు సంబంధించిన రక్షణ గోడ కొన్నిచోట్ల దెబ్బతినడంతో దారులు ఏర్పడ్డాయి. దీంతో ఎలుగుబంటి క్యాంపస్ లోకి వచ్చిందని విద్యార్దులు చెప్తున్నారు.
వెంటనే స్పందించిన సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ బృందం.. ఎలుగుబంటి పట్టుకుని మళ్లీ అడవుల్లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.