శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన బంటిగాడు ఎట్టకేలకు దొరికేశాడు. మత్తు మందు ఇచ్చి ఎలుగుబంటిని బంధించారు. ఎలుగు మత్తులోకి వెళ్లిన తరువాత నోటికి గుడ్డలు కట్టి తాళ్లతో బంధించారు. తరువాత బోనులోకి తరలించారు. ఏ సమయంలో దాడి చేస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు ఎలుగుబంటి దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఎంతో శ్రమ పడి ఎలుగును పట్టుకున్న అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ఎలుగును గుర్తించేందుకు అధికారులు ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామ పరిసరాలను ఫారెస్ట్ అధికారులు , పోలీసులు తీవ్రంగా గాలించాల్సి వచ్చింది.
వేర్వేరు బృందాలుగా విడిపోయి బంటి కోసం శ్రమించారు. దీనికోసం ఏకంగా డ్రోన్లతో కూడా వెదికేశారు. ఆఖరికి ఓ ఇంట్లో ఎలుగుబంటి దూరినట్టు గుర్తించి… ఆపరేషన్ భల్లూక్ మొదలు పెట్టారు. కిడిసింగిలో ఎలుగుబంటి ఉన్న షెడ్డు చుట్టూ వలలు కట్టారు.
అక్కడికి 100 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించలేదు. ఎలుగుబంటి వనాన్ని వీడి జనంలోకి రావడం.. సిక్కోలు జనం ఒంట్లో వణుకు పుట్టించింది. ఎలుగు బంటి కనబడినవారిన కనబడినట్టు దాడి చేసి భయపెట్టేసింది. ఎట్టకేలకు ఎలుగును పట్టుకునే సరికి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.