గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. చివరి రోజు బీటింగ్ రీట్రీట్ ను నిర్వహించారు. కళ్లు చెదిరే విద్యుత్ కాంతుల్లో రాజ్ పథ్ మెరిసిపోయింది. లేజర్ షోలు, సైనికుల బ్యాండ్ ప్రదర్శన, డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విజయ్ చౌక్ లో ఘనంగా బీటింగ్ రిట్రీట్ పరేడ్ జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా త్రివిధ దళాధిపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. ఈసారి డ్రోన్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చక్కటి సంగీతం నడుమ, మనోహరమైన ప్రదర్శనలు జరిగాయి. సాయుధ దళాల బ్యాండ్ లు, రాష్ట్ర పోలీస్ బృందాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. వెయ్యి డ్రోన్లతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది కేంద్రం. పది నిమిషాల పాటు సాగిన ఈ షోలో 75 ఏళ్ల స్వతంత్ర భారతాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శన చేశారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఈ ప్రొగ్రామ్ ను నిర్వహించారు. స్వాతంత్ర్య పోరాట యోధుల చిత్రాలు, ఆనాటి తీరుతెన్నులను లేజర్ షో రూపంలో ప్రదర్శించారు. ఇక నార్త్, సౌత్ బ్లాక్స్ దగ్గర కళ్లు చెదిరే లేజర్ షో నిర్వహించారు. రాజ్ పథ్ రంగురంగుల విద్యుత్ కాంతులలో మెరిసిపోయింది.
మరోవైపు ఈసారి రక్షణ శాఖ సాయంతో కొత్త ట్యూన్లు చేర్చారు. ‘హింద్ కి సేన’, ‘కేరళ’, ‘ఏ మేరే వతన్ కే లోగోన్ ట్యూన్లు’ త్రివిధ దళాలు తమ బ్యాండ్ల ప్రదర్శనలో వినిపించాయి. అయితే మహాత్మా గాంధీకి ఇష్టమైన క్రైస్తవ ట్యూన్ ‘అబైడ్ విత్ మీ’ని తొలగించారు. మొదటగా మాస్ట్ బ్యాండ్ వీర్ సైనిక్ ట్యూన్ తో వేడుక ప్రారంభమైంది. ‘సారే జహాన్ సే అచ్చా’ ట్యూన్ తో బీటింగ్ రిట్రీట్ పరేడ్ ముగిసింది.