బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానంలో టీమిండియా మాజీ ఆటగాడు రోజర్ బిన్ని ఆ పదవిని చేపడుతారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గంగూలీ పదవీ కాలంపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి చేరడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిరాకరించారని టీఎంసీ నేతలు అన్నారు. అందుకే గంగూలీని బీజేపీ నేతలు టార్గెట్ చేశారంటూ టీఎంసీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
అమిత్ షా కుమారుడు బీసీసీఐ కార్యదర్శి పదవిని మరోసారి పొందారని, కానీ గంగూలీకి మాత్రం ఆ అవకాశం దక్కలేదని టీఎంసీ ఎంపీ సంతన్ సేన్ అన్నారు. గంగూలీ మమత బెనర్జీ సీఎంగా ఉన్న రాష్ట్రానికి చెందిన వారు కావడం, బీజేపీలో చేరడానికి నిరాకరించడం దీని కారణమా? అంటూ ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలకు ఇది ఒక్క చక్కని ఉదాహరణ అని ఆయన అన్నారు.
టీఎంసీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. గంగూలీని తమ పార్టీలోకి చేరేలా బీజేపీ ఎప్పుడు ప్రయత్నాలు చేసిందో తమకు తెలియదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలిప్ ఘోష్ అన్నారు. గంగూలీ క్రికెట్ లెజెండ్ అని ఆయన అన్నారు.
ఇప్పుడు కొందరు బీసీసీఐలో మార్పుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టినప్పుడు సదరు పార్టీ నేతలు ఏ పాత్ర పోషించారని ఆయన ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడాన్ని టీఎంసీ నేతలు మానుకోవాలని ఆయన సూచించారు.