లిక్కర్ ధరలు ఎంత పెరిగినా.. మందుబాబులు మాత్రం ప్రభుత్వ ఆమ్దానీ పెంచడంలో మాత్రం ముందుంటున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లోనే రాష్ట్ర సర్కారుకు భారీగా లాభం వాటిల్లింది. ఏప్రిల్ 1 నుంచి 30వరకూ రూ. 2,550 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ సారి రూ. 280 కోట్లు అదనంగా లిక్కర్ సేల్ అయినట్టు వెల్లడైంది.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 570 కోట్లు, నల్లగొండలో 260 కోట్లు, వరంగల్ అర్బన్‌లో 250 కోట్లు, హైదరాబాద్ జిల్లాలో 230 కోట్ల లిక్కర్ అమ్ముపోయిందని రికార్డులు చెప్తున్నాయి. రాష్ట్రంలో 2,620 వైన్స్, 1000కి పైగా బార్‌లు ఉన్నాయి. రాష్ట్రంలోని 20 డిపోల నుంచి వీటికి మద్యం సరఫరా అవుతోంది.
రాష్ట్రంలో బీరు అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. రెండేండ్ల కిందటి వరకు ఐఎంఎల్ సేల్స్ కంటే బీర్ల అమ్మకాలు డబుల్ ఉండేవి. కానీ.. రాను రాను ఐఎంఎల్ కంటే బీర్ల సేల్స్ తగ్గిపోయాయి. మరోవైపు ఎక్సైజ్ శాఖ బీర్ ధరలను పెంచడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని తగ్గించాయి.
చల్లటి కూల్ డ్రింక్స్, బీర్లతో కరోనా ముప్పు పెరుగుతుందన్న వదంతులతో మందుబాబులు బీర్ తాగడం తగ్గించేశారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, బీరుపై రూ. 10 వరకు ధర కూడా తగ్గడంతో మళ్లీ బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఏప్రిల్ లో ఎండలు దంచికొట్టడం వల్ల కూడా బీర్ల సేల్స్ డబుల్ అయ్యాయి. నిరుడు ఏప్రిల్ లో 3.14 కోట్ల బీర్లు అమ్ముడుపోగా.. ఈసారి 5.8 కోట్ల బీర్లు సేల్ అయినట్టు రికార్డుల వెల్లడించాయి.