సంచలనం రేపిన బేగంబజార్ మర్డర్ కేసులో అనేక కోణాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను గుర్తించగా.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరంతా మృతుడి భార్య సంజనకు దగ్గరి బంధువులే. వారిని విచారిస్తున్నామని.. ఇంకా ఎవరికైనా ఇందులో ప్రమేయం ఉందా? లేదా? అనేది తెలుసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇటు కుటుంబసభ్యులతో కలిసి షా ఇనాయత్ గంజ్ పీఎస్ ముందు ధర్నాకు దిగింది సంజన. రెండు నెలల వయసున్న బాబుతో కలిసి.. న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. తన సోదరులే ఈ హత్య చేసినట్లు ఆరోపించింది. ఏడాదిగా బెదిరింపులకు పాల్పడుతున్నారని.. రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులను ఉరి తీయాలని వారు డిమాండ్ చేసింది.
అయితే.. సంజన తల్లి మాత్రం ఈ హత్యతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఆ సమయంలో తన కుమారుడు, బావ కుమారులు ఇంట్లోనే ఉన్నారని అంటోంది. మర్డర్ విషయం తెలుసుకుని భయపడి ఇంట్లో నుంచి పారిపోయినట్లు మీడియాకు వివరిస్తోంది. తన అల్లుడిని హత్య చేసిన వాళ్లను ఉరి తీయాలని డిమాండ్ చేస్తోంది.
అనేక ట్విస్ట్ లతో ఉన్న ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని కేసు స్వీకరించింది. జూన్ 30లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది. ఏడాది క్రితం సంజనను నీరజ్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.