ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్, సెంటిమెంట్స్ ఉంటాయి. ప్రముఖ దర్మకులు కోడి రామకృష్ణ తలకు క్లాత్ కట్టుకుంటారు. రాఘవేంద్ర రావు దాదాపు గడ్డంతోనే కనిపిస్తూంటారు. మూవీ షూటింగ్ జరిగినన్ని రోజులు రాజమౌళి పరిస్థితి కూడా దాదాపు ఇంతే. అయితే లెజెండరీ డైరెక్టర్ కే విశ్వనాథ్ మాత్రం మెగాఫోన్ పడితే.. ఒంటిపై ఖాకీ దుస్తులు ఉండాల్సిందే. ఆయన దర్శకత్వం వహించే సినిమాలో అందరూ ఖాకీ దుస్తుల్లోనే కనిపిస్తారు.
దానికి కారణం కూడా ఉంది. విశ్వనాథ్ సౌండ్ రికార్డిస్ట్ గా ఉండి డైరెక్టర్ అవతారం ఎత్తారు. ఒక స్థాయి నుంచి పై స్థాయికి వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. సినిమాల్లోనూ అంతే. ఏ విభాగంలో అడుగు పెట్టినా.. వాళ్ల చివరి లక్ష్యం దర్శకుడు అవ్వడం.
ఓ సందర్భంలో విశ్వనాథ్ మాట్లాడుతూ.. నా సెట్లో పని చేసే పెయింటర్స్, లైట్ బాయ్స్, హెల్పర్స్ అందరూ ఖాకీ దుస్తులే ధరిస్తారు. నేను కూడా అవే వేసుకుంటా. అయితే వాళ్లు నిక్కరు, నేను ప్యాంటు వేసుకుంటా అంతే తేడా ఉంటుందన్నారు. మీరు ఖాకీ డ్రెస్సు వేసుకోవడం ఏంటి? అని చాలా మంది అడిగారు. మొదటి సినిమా సరిగా ఆడకపోతే.. వెంటనే టాక్సీ డ్రైవర్ గా మారిపోతా.. అప్పుడు కుట్టించుకోవడానికి వీలు ఉంటుందో.. లేదో అని ఓ జత రెడీగా పెట్టుకున్నా అని సమాధానం ఇచ్చేవాడ్ని.
మొదటి సినిమా తీసే రోజుల్లో చాలా భయం వేసేదన్నారు. మాకు తెలిసిన పాత్రికేయులు మీ సినిమా గురించి రాస్తాం అనేవారు. కానీ మొదటి సినిమాకు ఏం రాయొద్దు అని చెప్పేవాడ్ని. రెండు, మూడు సినిమాలు తీశాక నాలో ప్రతిభ ఉందనిపిస్తు రాయండని చెప్పినట్టు తెలిపారు కే విశ్వనాథ్.