అల్లూరి సీతారామ రాజు 125 జయంతి వేడుకలను ప్రభుత్వం ఇటీవల ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కంచు విగ్రహాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.
ఈ విగ్రహావిష్కరణ చూడటానికి మాములగానే కనిపిస్తుంది. కానీ దీని వెనక చాలా మందికి అర్థం కానీ వ్యూహాన్ని బీజేపీ అమలు చేసినట్టు రాజకీయ పండితులు చెబుతున్నారు.
ఆదివాసీలకు దగ్గరయ్యే ఆలోచనః
స్వాతంత్ర్య పోరాట యోధుడిగా అల్లూరి సీతారామరాజు పై ఆదివాసి, గిరిజన తెగల వారికి మంచి గౌరవం ఉంటుంది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ పట్టణం జిల్లాల్లో సంచరిస్తూ అక్కడ గిరిజనులకు పోరాట పాఠాలు నేర్పారు. ఈ క్రమంలో వారికి అల్లూరి చేరువయ్యారు. అలాంటి నేతకు గౌరవం ఇచ్చి ఆయా వర్గాలకు చేరువయ్యేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు.
భీమవరంలోనే ఎందుకుః
అల్లూరి పుట్టిన ఊరు పండ్రంగి. ఇది ప్రస్తుతం విగ్రహం ఏర్పాటు చేసిన స్థలానికి సుమారు 500 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అల్లూరి త్యాగాలను, ఆయన గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పేందుకే విగ్రహాన్ని ఏర్పాటు చేశారనుకుంటే .. విగ్రహాన్ని సీతారామ రాజు పుట్టిన ఊర్లోనే ప్రతిష్టించి వుంటే ఇంకా బాగుండేది కదా. కానీ అలా కాకుండా భీమవరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
భీమవరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉండేది. అల్లూరి సీతారామ రాజు మూలాలు అన్ని భీమవరం దగ్గర మోగల్లులో ఉన్నట్టు చాలా మంది చెబుతుంటారు. ఇక ఈ జిల్లాలో అగ్రవర్ణాల వారు ముఖ్యంగా క్షత్రియ కులాల జనాభా ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఓట్ల పరంగా చూస్తే మిగతా కులాలతో పోలిస్తే కొద్దిగా తక్కువగానే ఉన్న ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపగలరు. అందువల్ల ఆ వర్గాలకు దగ్గరయ్యేందుకు భీమవరంలో విగ్రహం ఏర్పాటు చేసినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అందుకే ఏపీకి మోడీ వచ్చారాః
మిషన్ సౌత్ ఇండియాపై బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రత్యేక ప్రతిపత్తి కావాలని ఏపీ ప్రజలు బీజేపీని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఏపీపై బీజేపీకి చిత్తశుద్దిలేదనే భావన ప్రజల్లో కనిపిస్తోంది.
కానీ బీజేపీ మాత్రం ఏపీ ప్రయోజనాల విషయంలో తాము సీరియస్ గానే ఉన్నట్టు చెబుతోంది. ఇలాంటి తరుణంలో తెలంగాణలో కీలక సమావేశాన్ని నిర్వహించి ఏపీకి ప్రధాని రాకపోతే అది వేరే సంకేతాలను తీసుకు వెళుతుందని, అందుకే బీజేపీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.