ఆంధ్రప్రదేశ్ లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. క్షుద్ర పూజల మాయలో పడి ఎదిగిన బిడ్డలను సొంత తల్లితండ్రులే పొట్టనపెట్టుకున్నారు. మీరు మరణించినా… మేం మళ్లీ పుట్టిస్తాం అంటూ కూతుళ్లను నమ్మించి, వారి ప్రాణాలు తీశారు.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఈ ఘోర ఘటన జరిగింది. ఎన్.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) పిల్లలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె బోపాల్‌లో పీజీ చేస్తుండగా, చిన్నకుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది.
అయితే, తల్లితండ్రులకు కుద్రపూజలపై నమ్మకం ఎక్కువగా ఉండేదని స్థానికులంటున్నారు. గతేడాది ఆగస్టులో కొత్త నిర్మించుకున్న ఇంట్లోకి మారిన వీరు లాక్ డౌన్ లో పూజలు చేస్తుండేవారని తెలుస్తోంది. ఆదివారం రాత్రి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో లెక్చరర్ తో చెప్పగా, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఇంటికి వచ్చి చూసే సరికి వారిద్దరు విఘత జీవులుగా ఉన్నారు.
తల్లితండ్రులు, పిల్లలు పూర్తిగా దైవభక్తిలో లీనమైపోయారని… బిడ్డలు మళ్లీ బతుకుతారని చంపినట్లు ప్రాథమికంగా తేలిందని పోలీసులంటున్నారు. తల్లి పద్మజ బిడ్డలను కొట్టి చంపినట్లు, ఈ ఘటన జరిగినప్పుడు తండ్రి పురుషోత్తంనాయుడు కూడా అక్కడే ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. తల్లిదండ్రులు కూడా మానసికంగా సతమతమవుతున్నట్లు గుర్తించామని, వారు ఏ అఘాయిత్యం చేసుకోకుండా ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.