బాలీవుడ్ లో పరిస్థితి ఇప్పుడు ఘోరంగా తయారైంది. పెద్ద పెద్ద సినిమాలన్నీ డిజాస్టర్లు అవుతున్నాయి. మొన్నటికిమొన్న కంగనా రనౌత్ సినిమా విడుదలై ఆల్ టైమ్ డిజాస్టర్ అనిపించుకుంది. కేవలం కంగనా కెరీర్ లోనే కాదు, బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా వచ్చిన భూల్ బులయా-2 తప్ప మరే సినిమా ఆడలేదు. జెర్సీ, రన్ వే 34, హీరోపంతి 2, జయేష్ భాయ్ జోర్దార్, జెర్సీ.. ఇలా అన్ని సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.
బాలీవుడ్ లో ఓవైపు పరిస్థితి ఇలా ఉంటుంటే, మరోవైపు సౌత్ నుంచి వెళ్లిన కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అక్కడ సూపర్ హిట్టయ్యాయి. కళ్లు చెదిరే వసూళ్లు సాధించాయి. బాలీవుడ్ జనం మొత్తం సౌత్ వైపు చూస్తున్న టైమ్ లో, మన హీరో బెల్లంకొండ మాత్రం బాలీవుడ్ కు వెళ్లి హిందీ సినిమా చేస్తున్నాడు. దీంతో అతడి బాలీవుడ్ డెబ్యూను అంతా రాంగ్ టైమ్ అంటున్నారు.
నిజానికి బెల్లంకొండ తన బాలీవుడ్ సినిమా స్టార్ట్ చేసే టైమ్ కు పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఆ తర్వాతే పూర్తిగా మారిపోయాయి. సౌత్ సినిమాలే ఎక్కువగా బాలీవుడ్ లో క్లిక్ అవ్వడం మొదలయ్యాయి. పైగా లార్జర్ దేన్ లైఫ్, భారీ వినోదం ఉన్న సినిమాలకు మాత్రమే థియేటర్లకు వస్తామని ఆడియన్స్ తేల్చేశారు.
ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న బెల్లంకొండ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. నిజానికి ఛత్రపతి సినిమాలో హెవీ డోస్ యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆ సినిమా రీమేక్ తో అడుగుపెట్టాలనుకోవడం సరైన నిర్ణయమే. కాకపోతే మారిన పరిస్థితుల నేపథ్యంలో, ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకర్షిస్తుందనేది చూడాలి.