మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత తీరు వివాదాస్పదమైంది. ఏకంగా కమిషనర్ పైనే ఆమె దాడికి ప్రయత్నించింది. చైర్ పర్సన్ ఛాంబర్ లోనే ఇదంతా జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కొత్త ఇంటి నెంబర్లు జారీ చేయాలని.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొందరు కౌన్సిలర్లు కమిషనర్ రజిత దృష్టికి తీసుకెళ్లారు. కొద్ది రోజులుగా సెలవులో ఉన్న ఆమె.. తాజాగా వచ్చీరాగానే దరఖాస్తులు పెట్టుకున్న వారికి ఇంటి నెంబర్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంటి నెంబర్ల జారీ విషయం చైర్ పర్సన్ శ్వేతకు తెలిసింది. వెంటనే ఛాంబర్ లోకి రావాలని రజితకు పిలుపు వెళ్లింది. ఇంటి నెంబర్లు ఎందుకు జారీ చేస్తున్నారంటూ కమిషనర్ ను ప్రశ్నించగా.. ఇందులో తప్పేముందని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. కమిషనర్ తీరుతో ఆగ్రహంతో ఊగిపోయిన చైర్ పర్సన్ తన టేబుల్ మీదున్న కాలింగ్ బెల్ ను కమిషనర్ పైకి విసిరేసినట్లు సమాచారం.
శ్వేత చర్యతో షాకైన రజిత.. కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని కలెక్టర్ భారతి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి వ్యాప్తంగా ఈ విషయంపై చర్చ నడుస్తోంది. తనకు కౌన్సిలర్లకు మధ్య కావాలనే దూరం పెంచుతున్నారని శ్వేత చెబుతున్నారు.