మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దేశవ్యాప్తంగా చెలరేగిన ఘర్షణలు తారా స్థాయికి చేరాయి. నిరసనల పేరుతో దేశంలో పలుచోట్ల మసీదులలో ప్రార్ధనల తర్వాత రగిల్చిన కార్చిచ్చు.. రగులుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్ లో శనివారం కూడా హింస చోటుచేసుకుంది. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఆలయంలో పూజారి, ఆయన కుటుంబం ప్రాంగణంలో నిద్రిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు.
ఈ నేపథ్యంలోనే యూపీలో ఈ ఘటనలకు సంబంధించి 255 మందిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ప్రయాగ్ రాజ్ లో పోలీసులపై రాళ్ల దాడికి చిన్నపిల్లలను ఉపయోగించినట్టు గుర్తించారు పోలీసులు.
అంతేకాకుండా.. బీజేపీ బహిష్కృత నేత నుపూర్ శర్మ తల నరికేస్తున్నట్టు వీడియో రూపొందించి యూట్యూబ్ లో పెట్టిన జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఫైజల్ వనీ అనే యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హౌరా జిల్లాలో పలు చోట్ల 144 సెక్షన్ విధించారు. అక్కడ జరిగిన హింసను పర్యవేక్షించేందుకు వచ్చిన సుకాంత మజుందార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఈ అరెస్ట్ ను ఖండిస్తూ.. బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బెంగాల్ జమ్మూ కశ్మీర్ లా మారుతోందని సుకాంత ఆరోపించారు.
బెంగాల్ లో శాంతిభద్రతలు దిగజారుతున్నాయంటూ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం మమతా బెనర్జీని ఆదేశించారు. నిందితుల పట్ల ఔదార్యం చూపుతుండడం దురదృష్టకరమంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లకు నిప్పు పెట్టారు నిరసన కారులు.
ఢిల్లీలో జామా మసీదు బయట ప్రదర్శనల ఉదంతానికి సంబంధించి కేసు నమోదైంది. ప్రతి మసీదు, మదర్సా లోపల, బయట హై క్వాలిటీతో కూడిన సీసీ కెమెరాలు పెట్టాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. ఆందోళనకారులు ఏయే ప్రార్థనా స్థలాల్లో నుంచి బయటికొచ్చి గొడవకు దిగారో అవే ఈ విధ్వంసానికి బాధ్యత వహించాలని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నుపూర్ శర్మకు బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మద్దతుగా నిలిచారు.