మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్రం హౌరాలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
పోలీసు వాహనాలకు నిరసనకారులు నిప్పంటించారు. దీంతో పాటు పోలిస్ అవుట్ పోస్టును ఆందోళనకారులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో హౌరాలో పరిస్థితిని పరిశీలించేందుకు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ శనివారం బయలుదేరారు.
హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని మార్గమధ్యలోనే అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. మొదట ఆయన్ని తన ఇంటివద్దనే అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
ప్రస్తుతం హౌరాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి వెళ్లడం సరికాదని ఆయనకు పోలీసులు సూచించారు. కానీ తన ఇంటివద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లపై నుంచి దూకి ఆయన పంచల పట్టణానికి కారులో బయలు దేరారు. దీంతో ఆయన్ని మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు.