పశ్చిమ బెంగాల్‌లో పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెడతానని బీజేపీ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని, లేదంటే పోలీస్ స్టేషన్ ను తగులబెడతామని ఎమ్మెల్యే స్వపన్ మజుందార్ హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యేపై టీఎంసీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
24 పరగణాల జిల్లాల్లోని నిర్వహించిన సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మజుందార్ మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆయన అన్నారు. తమ మాటను పోలీసులు అసలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పోలీసులు టీఎంసీ ఏజెంట్ల లాగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
పోలీస్ స్టేషన్‌ను తగలబెడతామంటూ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగడంతో టీఎంసీ నేతలు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఇలాంటి ప్రకటన చేయడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని టీఎంసీ నేతలు పేర్కొన్నారు.
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భుర్కుందలో బీజేపీ మండల అధ్యక్షుడు దిలీప్ వైద్య హత్యకు గురయ్యారు. పంచాయతీ కార్యాలయం ఎదుట ఆయన్ని టీఎంసీ నేతలు హత్య చేశారు. దీనిపై ఫిర్యాదు చేసిన నిందితులను అరెస్ట్ చేయలేదని బీజేపీ ఆరోపించింది.
ఈ హత్యకు నిరసనగా నైహతి రోడ్డు నుంచి బీజేపీ శనివారం నిరసన ర్యాలీ చేపట్టింది. బీజేపీ నేత హత్య నేపథ్యంలో పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సహాయంతో టీఎంసీ నేతలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.