అదానీ వ్యవహారంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ .. ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఏదో ఒక రోజున ఎల్ ఐ సిని, బ్యాంకులను, చివరకు పోస్టాఫీసులను కూడా మూసివేయాలని ఈ సర్కార్ కోరుతుందేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం హౌరాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె..ఈ సంస్థల్లో కోట్లాది ప్రజలు తాము శ్రమకోర్చి సంపాదించుకుంటున్న సొమ్మును డిపాజిట్ చేస్తున్నారని . ఒకవేళ ఇదే పరిస్థితి వస్తే వారంతా ఎక్కడికి వెళ్తారని ఆమె ప్రశ్నించారు.
ఎస్ బీ ఐ, ఎల్ ఐ సి వంటివి ప్రజలకు భరోసా ఇస్తున్నాయని, ప్రజల డిపాజిట్లకు ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నాయని ఆమె అన్నారు. ప్రజల డిపాజిట్లనే ఈ సంస్థలు వివిధ వ్యాపార సంస్థలకు రుణాలుగా మంజూరు చేస్తున్నాయన్నారు.
అసలు . అదానీ కంపెనీల అంశంపై ప్రధాని మోడీ ఎందుకు నోరు విప్పడంలేదన్నారు.ఇక తమ రాష్ట్రానికి సంబంధించి వంద రోజుల జాబ్ గ్యారంటీ పథకానికి కేంద్రం నుంచి ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని మమత ఆరోపించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 7 వేల కోట్ల రూపాయలు అందవలసి ఉందని, తాము ఎన్నోసార్లు అభ్యర్థించినా ఇంకా ఈ ఫండ్స్ అందలేదన్నారు. అదానీ అంశంపై మమత మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టడం ఇదే మొదటిసారి.