కేంద్రం, బీజేపీపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు అనేక కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి ఓటు వేసి అధికారం అప్పగిస్తే ప్రజల గొంతును అణిచివేస్తారన్నారు. మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో వీల్‌చైర్‌లో కూర్చునే మమతా ప్రచారం నిర్వహించారు.
బీజేపీ ప్రచార సభలపై మమతా తనదైన శైలీలో విమర్శించారు. ప్రజల మద్దతు లేదని తెలిసినందు వల్లే ఎన్నికల సభలకు జనాలను కొని రప్పిస్తున్నారన్నారు. తన గాయాన్ని ప్రస్తావిస్తూ… గాయపడిన ఆడ పులి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఒంటి కాలితోనే పోరాటం సాగిస్తాను. నా కూతుళ్లు, తల్లుల రెండు కాళ్ల సాయంతో ఈ పోరాటం ముందుకు తీసుకువెళ్తాను అని తన ప్రసంగంలో వివరించారు.
బీజేపీ తనను ఎంతగా వేధించినా లెక్కచేయనని, బెదరించడం ద్వారా తనను ఆపలేరని, సీబీఐ, ఈడీలను ఉసగొల్పుతూ బీజేపీ కుట్రలు సాగిస్తోందని మమత మండిపడ్డారు. హరే కృష్ణ హరే హరే మంత్రాన్ని మమత బిగ్గరగా ఉచ్ఛరిస్తూ, ఈ మంత్రంలాగే ప్రతి ఇంట్లోనూ టీఎంసీ స్థానం పదిలంగా ఉందన్నారు.