ఈడీ దర్యాప్తు పరిధులు లిక్కర్, పొలిటికల్, మాదకద్రవ్యాల వంటి రంగాలను దాటి ఎంటర్టైన్మెంట్ కి కూడా విస్తరించినట్టు కనబడుతోంది. పశ్చిమ బెంగాల్ లో జరిగిన టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో నటుడు బోనీ సేన్ గుప్తాకు ఈడీ అధికారులు సమన్లు పంపారు. ఆయన రేపు ఈడీ ముందు హాజరు కావలసి ఉండగా.. గురువారమే కోల్ కతా లోని ఈడీ ప్రధాన కార్యాలయంలో వారి ముందు హాజరయ్యాడు. ఈ స్కామ్ లో ఇంకా పలువురు నటీనటుల పేర్లు ఈడీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఏమైనా ఈ స్కామ్ లో ఒక నటుడు ఈడీ ముందు హాజరు కావడం ఇదే మొదటిసారి. హుగ్లీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత కుంతల్ ఘోష్ ని ఈ కేసులో ప్రశ్నించినప్పుడు ఒకరి పేరు వెనుక ఒకరి పేర్లు బయటకు వస్తున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. వీరిలో బోనీ సేన్ గుప్తా కూడా ఒకరు. ప్రస్తుతం కుంతల్ ఘోష్ జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.
ఇతనికి, బోనీకి మధ్య ఆర్థిక లావాదేవీలేమైనా జరిగాయా అన్న విషయాన్ని ఈడీ ఆరా తీస్తోంది. బెంగాల్ మాజీ విద్యా శాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన స్నేహితురాలు అర్పితా ముఖోపాధ్యాయ మొదట ఈ కేసులో అరెస్టయ్యారు.
రాష్ట్రంలో గ్రూప్ సి, డి ఉద్యోగులు, 9 నుంచి 12 వ తరగతి అసిస్టెంట్ టీచర్లు, ప్రైమరీ టీచర్ల రిక్రూట్మెంట్ లో భారీగా అవకతవకలు జరిగాయని వార్తలు వచ్చాయి. దీనిపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు.. ఈ ఉదంతంపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.