మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బెంగాల్ లోని హౌరా, ముర్షిదాబాద్ లల్లో ఆందోళనలు శనివారం హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు బెంగాల్ ప్రతిపక్షనేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఆదివారం వెళ్లనున్నారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హౌరాలో బీజేపీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారని తెలిపారు. హౌరాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. కార్యాలయంతో పాటు అక్కడ పరిస్థితులను పరిశీలించేందుకు ఆదివారం హౌరాకు తాను వెళుతున్నట్టు పేర్కొన్నారు.
తమ పార్టీ కార్యాలయం తమకు దేవాలయం లాంటిదని ఆయన అన్నారు. ఆ బూడిదైన చోటే పార్టీ కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తామని కార్యకర్తలకు ఆయన హామీ ఇచ్చారు. చరిత్రలోనూ ఎంతో మంది విదేశీయులు మన ఆలయాలను నేల మట్టం చేశారని అన్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఆలయాలపై కాషాయ జెండాలు ఎగురుతున్నాయని చెప్పారు.
హౌరాలో అల్లర్ల నేపథ్యంలో అక్కడ పరిస్థితులను పరిశీలించేందుకు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ శనివారం బయలుదేరారు. హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని మార్గమధ్యలోనే అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. మొదట ఆయన్ని తన ఇంటివద్దనే అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.