దేశంలో ఉత్తమ ఎయిర్ పోర్టు అవార్డును బెంగళూరుకు చెందిన కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దక్కించుకుంది. దీంతో పాటు ‘ ఏవియేషన్ ఇన్నోవేషన్ ‘ అవార్డును కూడా గెలుచుకుంది.
ఈ అవార్డులను పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రధానం చేశారు. వినియోగదారుల సేవలు, సౌకర్యాలు, ఆవిష్కరణల్లో ఉత్తమ ప్రమాణాలు పాటించిన ఎయిర్ పోర్టులకు ఈ అవార్డులను అందజేశారు.
ప్రయాణీకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను అందించడంలో తమ అవిశ్రాంత ప్రయత్నాలకు వింగ్స్ ఇండియా 2022లో ఈ గుర్తింపు లభించడం తమకు గౌరవంగా ఉందని బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్) ఎండీ, సీఈవో హరి మరార్ తెలిపారు.
ప్రపంచ స్థాయి విమానాశ్రయం ఆపరేటర్‌గా డిజిటల్ సొల్యూషన్స్, టెక్ ఇన్నోవేషన్‌లను ప్రారంభించడానికి బీఐఏఎల్ అనేక చర్యలను చేపట్టిందన్నారు.
పెరుగుతున్న ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి తమ సేవలను మరింత మెరుగుపర్చడానికి ఈ అవార్డులు తమను మరింత ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు.