కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ పై బహుజన సమాజ్ వాది పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్ అనేది పార్టీ కోసం కాకుండా దేశం కోసం వుండాలని ఆమె మండిపడ్డారు.
ఏదైనా పథకం లబ్ధిదారుల గురించి మాట్లాడేటప్పుడు ఇది 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారిన పౌరులు, రైతులు మొదలైన వారి అమృత్‌కాల్ కోసం తహతహలాడే విశాల దేశమని కేంద్రం గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు. బడ్జెట్ లో పార్టీ కన్నా దేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటే బాగుంటుందన్నారు.
గతంలో భారీ వాగ్దానాలు, ప్రకటనలతో గత తొమ్మిదేండ్లలో సమర్పించిన బడ్జెట్ ల మాదిరిగానే ఈ బడ్జెట్ ఉందని ఆమె అన్నారు. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం కారణంగా దేశంలోని మధ్యతరగతి వర్గం దిగువ మధ్యతరగతిగా మారడంతో గత తొమ్మిదేళ్లలో కేంద్రం తన బడ్జెట్‌లో కురిపించిన వాగ్దానాలు, ప్రకటనలు అర్థరహితంగా మారాయన్నారు.
గత బడ్జెట్‌లతో పోలిస్తే కేంద్ర బడ్జెట్ 2023 కూడా భిన్నంగా ఏమీ లేదని పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో పెద్దగా ఏమీ లేదన్నారు. ఏ ప్రభుత్వమూ గత ఏడాది లోపాలను చెప్పదన్నారు. ప్రజలు ఆశలపై బతుకుతున్నారని చెప్పారు. కానీ ఎందుకు వారికి తప్పుడు ఆశలు కల్పిస్తారని అన్నారు.