పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న పలు పథకాల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షించారు. పల్లె ప్రగతి, జాతీయ ఉపాధి హామీ పథకం, గామీణ సడక్ యోజన, స్వయం సహాయక బృందాల పనితీరు తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ హనుమంత రావు, తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. దేశంలోనే అన్ని గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పల్లె ప్రగతి, హరిత హారం లాంటి రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక కార్యక్రమాల కారణంగానే వంద శాతం గ్రామాలు ఒడిఎఫ్ గా మారాయని ఆమె అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు గణనీయంగా పెరగడంతోపాటు గ్రామ పంచాయతీల పాలన మెరుగుపడిందన్నారు. డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గడం, గ్రామ పారిశుధ్యం మెరుగుపడడంతో పాటు గ్రీన్ కవర్ గణనీయంగా పెరిగిందని శాంతి కుమారి పేర్కొన్నారు.
అన్ని గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు సమకూర్చడం జరిగిందని, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపాధి హామీ పథక పురోగతిని సమీక్షిస్తూ,రాష్ట్రంలో1.11 కోట్ల మందికి 52.78 లక్షల జాబ్ కార్డులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు.