– తెలంగాణలో ఏపీ రాజకీయాలు
– కొత్త మంత్రి వర్గంపై బెట్టింగ్ లు
– హైదరాబాద్ అడ్డాగా దందా
– నగరంలో మకాం వేసిన బెట్టింగ్ రాయుళ్లు
– ఎక్కువగా ఏపీ రాజకీయ నేతలు
– లక్షల్లో బెట్టింగ్ లు
– పట్టించుకోని పోలీసులు
ఏపీలో కొత్త మంత్రివర్గం సోమవారం కొలువుదీరనుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ, కుల సమీకరణాల వారీగా మంత్రివర్గం ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పాత మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. అయితే.. కొత్త మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే దానిపై రాజకీయాల్లో సర్వత్రా చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా పొలిటికల్ లీగ్ నడుస్తోంది. ఏపీలో కొత్త మంత్రివర్గంపై రెండు రోజుల బెట్టింగ్ కొనసాగుతోంది. పాత మంత్రులతో పాటుగా.. కొత్తగా ఎవరెవరు మంత్రివర్గంలో ఉంటారనే అంశంపై బెట్టింగ్ లు జోరందుకున్నాయి. హైదరాబాద్ లోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ వంటి ప్రాంతాలు ఈ బెట్టింగ్ కు వేదికగా మారాయని పలువురు చెప్తున్నారు. అంతేకాదు ఏపీకి చెందిన పలువురు రాజకీయ నేతలు, బెట్టింగ్ ల కోసం హైదరాబాద్ లోని పలు హోటళ్లలో మకాం వేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. మహిళల కోటా నుంచి విడుదల రజిని, ధనలక్ష్మి, రోజా పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ సారి రోజాకు అవకాశం ఇవ్వాలా లేదా అనే విషయంలో జగన్ తర్జనభర్జన చెందుతున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే.. విడుదల రజినీకి మాత్రం మంత్రివర్గంలో తప్పనిసరిగా స్థానం దక్కుతుందనేది అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
కొత్త మంత్రులు 15 మంది, పాత మంత్రులు 10 మంది ఉంటారని ప్రచారం జోరుగా జరుగుతోంది. అంతే హుషారుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. కొడాలి నానికి తప్పనిసరిగా అవకాశం కల్పిస్తున్నారంటూ అదే ప్రాంతానికి చెందిన పలువురు హైదరాబాద్ లో రూ. 10 లక్షల వరకు బెట్టింగ్ పెడుతున్నారు. ప్రధానంగా కొడాలి నాని, బుగ్జన రాజేంద్రప్రసాద్, విడుదల రజినీ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, ధర్మాన ప్రసాదరావు పేర్లపై బెట్టింగ్ లు ఎక్కువగా ఉంటున్నాయి.
Advertisements
రూ.1 లక్ష నుంచి మొదలుకుని రూ. 10 లక్షల వరకు బెట్టింగ్ పెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు హోటళ్లలో బెట్టింగ్ రాయుళ్లు మకాం వేసి.. తమ దందాను యదేచ్చగా సాగిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జరుగుతున్నా ఐపీఎల్ బెట్టింగ్ ల కంటే ఎక్కువగా.. ఏపీ పొలిటికల్ లీగ్ పైనే ఎక్కువగా బెట్టింగ్ లు జరుగుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పోలీసులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.