ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఆగిపోయిన దశలో… భారత్ బయోటెక్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. దేశీయంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుందని ప్రకటించింది. ఐసీఎంఆర్ తో కలిసి తయారు చేసిన కోవాక్జిన్ అనే BBV152 వ్యాక్సిన్ కోతులపై చేసిన ప్రయోగాల డేటాను విడుదల చేసింది.
మనుషులపై ప్రయోగాల కన్నా ముందు కోతులపై చేసిన ప్రయోగాల్లో కోవాక్జిన్ పనితీరు అద్భుతంగా ఉందని… రెండు డోసులుగా వేసే ఈ వ్యాక్సిన్ 14రోజుల్లో కరోనా వైరస్ ను అంతం చేస్తుందని ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ తర్వాత గొంతు నొప్పి, ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఏమీ కనిపించలేదని… యాంటీబాడీస్ ను వృద్ధి చేసి, కరోనా వైరస్ ను నాశనం చేస్తుందని ప్రకటించింది. 20కోతులపై ఈ ప్రయోగాలు చేసినట్లు తెలిపింది.
ఇప్పటికే రెండో దశలో మానవులపై ప్రయోగాలు చేస్తున్న కోవాక్జిన్… ఫేజ్-1 ట్రయల్స్ డేటాను అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. దేశంలో దాదాపు 12చోట్ల ఫేజ్-1కోవాక్జిన్ ట్రయల్స్ చేశారు. ఇప్పటి వరకు కోవాక్జిన్ తీసుకున్న వాలంటీర్స్ కు ఎలాంటి ఇబ్బంది లేదని, తమ వ్యాక్సిన్ సక్సెస్ అవుతుందని సంస్థ ధీమా వ్యక్తం చేస్తుంది.